Saturday, July 13, 2024
spot_img
HomeCinemaకృష్ణ సినీమానవీయం

కృష్ణ సినీమానవీయం

కృష్ణ సినీమానవీయం

[ad_1]

 

ప్రతిభావంతులు తాము ఎంపిక రంగంలో రాణించడం సహజమే. అయితే వచ్చే పేరు ప్రతిష్టలను వాడుకొని మరింత లాభపడాలని, ఆ పీఠం మీద నిలబడి ఏదో అందాలను చేరుకోవాలని తాపత్రయపడేవారే అధికం. స్వార్థ చింతనతో కూడిన ఈ ఆలోచన ఎలాంటి ఫలితాలను ఇచ్చిన వారు తమ ప్రతిభను, జనాభిమానాన్ని అంగట్లో పెట్టి అమ్ముకున్నట్లే అవుతుంది. కళలో రాణింపు కన్నా మనిషిగా గెలవడం ఎవరికైనా గొప్ప విజయం. అలాంటి వారిలోని మానవీయ కోణం వారి కళాజీవితానికి కొత్త వన్నెలద్దుతుంది. తెరపై నటించిన వారిలో చాలా మట్టుకు బయట కూడా నటిస్తూ ఉంటారు. దానిని దాటి వచ్చి తోటి మనుషులతో మనిషిగా, వీలైతే అంతకు మించి మెదిలేవారు జనాభిమానానికి దగ్గరవుతారు. ఒక నటుడు చనిపోతే ఆయన నటించిన సినిమాల గురించి చర్చ జరుగుతుంది.

ఒక మనిషి వెళ్ళిపోతే ఆయన మంచితనాన్ని గుర్తు చేసుకుంటారు. ఈ రెంటి మేలికలయికగా సాగి ఇటీవల ముగిసిన ప్రముఖ సినీ నటుడు కృష్ణ జీవితం తరచి చూస్తే మనవాళికే ఆదర్శనీయంగా గోచరిస్తోంది. మానవీయ విలువలతో, సామాజిక స్పృహతో, కుల మత వర్గాలకు కొమ్ముకాయకుండా, అందరివాడిగా గడచిన ఆయన బ్రతుకులో ప్రతి మలుపు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. నటన ద్వారా వచ్చిన కీర్తిని, ధనాన్ని చూసి పొంగిపోకుండా, పొగరు కొమ్ములు రాకుండా సినీరంగంలోనూ, సమాజంలోనూ సాటి మనిషిగా ఆయన కొనసాగిన తీరు అనితరసాధ్యమనిపిస్తుంది. నిండు పున్నమి చంద్రుణ్ణి అకస్మాత్తుగా అమావాస్య కమ్మినట్లు కృష్ణ నిర్యాణం కోట్లాది మందిని కలచివేసింది.గుండెపోటుతో ఆయన ఆసుపత్రిలో చేరినవార్త ఇంటింటికి విషాదాన్ని చేరవేసింది.ఏమవుతుందోనన్న బెంగతో ఎదురు చూసినవారికి నిరాశే మిగిలింది. కృష్ణ 15 నవంబర్ నాడు తుది శ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

1970 దశకంలోని యువత గుండెల్లో ఎన్టీఆర్ తర్వాత నటుడు కృష్ణ ఆరాధ్య అభిమానిగా నిలిచారు. అప్పుడప్పుడే ప్రపంచ సినీరంగం కుటుంబ కథలతో పాటు యాక్షన్, స్టంట్, డిటెక్టివ్, కౌబాయ్ లాంటి నూతన పోకడల వైపు మళ్లింది. సీనియర్ నటుల కన్నా చురుగ్గా, చలాకీగా ఉండే యువకులే ఆ పాత్రలకు అవసరమైన కాలం. ఆ సందర్భానికి అందివచ్చిన నటుల్లో సరిగ్గా ఒదిగినవారు కృష్ణ. క్రమంగా కుటుంబ కథా చిత్రాలకు తగినవాడిగా ఎదిగి సామాజిక, చారిత్రక కథాంశాలతో, సొంత నిర్మాణంతో అజేయుడిగా సినిమా పరిశ్రమలో నిలిచారు. సినిమా హీరో కావాలనే కృష్ణ కాంక్ష 22 ఏళ్ల వయసులోనే తీరింది. ఆయన కథానాయకుడిగా నటించిన తొలి తెలుగు సాంఘిక వర్ణ చిత్రం తేనే మనసులు విజయం సాధించడంతో ఆ పరంపర అలాగే కొనసాగుతోంది. ఆయన హీరోగా 1966లో వచ్చిన గూఢచారి 116 ఘన విజయంతో కృష్ణకు వరుసగా సినిమా అవకాశాలు దొరికాయి.

కృష్ణలోని సాహస గుణం, మొండి పట్టుదల ఆయనకు గెలుపుబాటలే వేశాయి. లక్ష్యాన్ని ఛేదించాలంటే గురి ఎంత కుదురాలో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. చిత్రసీమలో అడుగుపెట్టిన ఆరేళ్లకే సొంత నిర్మాణ సంస్థను ఆరంభించడం మాములు విషయం కాదు. ఆయనకున్న ప్రజ్ఞ, మేధస్సుల దృష్ట్యా కృష్ణ మరే వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఉన్నా ఇంతటి విజయం సాధించేవారే అనవచ్చు. అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణను తెలుగు జాతి ముద్దుబిడ్డగా నిలబెట్టింది. దానికి ఆయన పడ్డ శ్రమ సామాన్యం కాదు. అప్పటికి ఆయన వయసు 31 ఏళ్లు మాత్రమే. నిజానికి అంతటి సాహసానికి ఆ వయసు చాలా చిన్నది. అగ్ర నటుడు ఎన్టీఆర్‌ను ఎదురొడ్డి తీసిన సినిమా. ఆయన చిత్ర నిర్మాణం కూడా రాజీపడకుండా భారీగానే ఉంటుంది. లాభనష్టాలు, జయాపజయాల బెంగ ఆయన చెంత చేరదు.

ఈ సినిమా నిర్మాణం జరుగుతుండగానే దర్శకుడు వి రామచంద్రరావు హఠాత్తుగా మరణించారు. సగానికి పైగా సినిమా కృష్ణనే దర్శకత్వం వహించాడని అంటారు. అయితే సినిమా టైటిల్స్‌లో మాత్రం దర్శకత్వ గౌరవం కీ.శే. వి. రామచంద్రరావుకే చెందింది. ఆ చిత్రం ఘన విజయం సాధించిన తరువాత ఎక్కడ, ఎన్నడు కూడా చిత్ర దర్శకత్వంలో నా పాత్ర ఉందని ఆయన ప్రకటించలేదు. ఈ హుందాతనం కృష్ణ సొంతం, స్వతహాగా అబ్బిన గుణంలా ఆయన ఉన్నతికి అది వన్నె తెచ్చిందనవచ్చు. గత రెండు మూడు రోజులుగా పత్రికలు, టివిల్లో వచ్చిన కృష్ణ మరణ విషాద కథనాలలో సినిమా నటుడి ఘనత కన్నా ఆయనలోని మానవత్వ సుగుణమే ఎక్కువగా పరిమళించింది. 350కి పైగా సినిమాల్లో నటించిన ఆయన విర్రవీగిన క్షణం ఒక్కటి లేదు. అమితాబ్ బచ్చన్ నటుడిగా ఉన్న రోజుల్లో బిబిసి పాత్రికేయుడు ఆయన ఇంటర్వ్యూ కోరుతూ తన విజిటింగ్ కార్డు చేతికిస్తే దాన్ని చించేసి అమితాబ్ సరసరా వెళ్ళిపోయాడట.

నిజమెంతో కానీ ఇచ్చిన ఇంటర్వ్యూ కన్నా ఇవ్వని విషయమే ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. ఎదిగినా ఒదిగి ఉండే గుణం, సంయమనం సాధించడం దక్కిన విజయాల కన్నా కఠినమైనవి. తాను ఎదిగిన ఎత్తు తెలిసినా దానిలో పదో వంతును కూడా అంగీకరించని మనస్తత్వం కృష్ణ ఇంటర్వ్యూలలో కనబడుతుంది.

సినిమా పరిశ్రమకు మూల స్తంభం నిర్మాతలే అయినా సర్వం కోల్పోయిన నిర్మాతలను పట్టించుకునేవారే ఉండరు. కృష్ణ మాత్రం నష్టపోయిన నిర్మాతలను చేరదీసి ఆదుకొనేవాడని నిర్మాతలే చెబుతున్నారు. తన సినిమా ద్వారా నష్టపోయిన వారి నుండి పారితోషికం తీసుకోకుండానే మరో సినిమాకు డేట్స్ ఇస్తే తానే కొంత మొత్తాన్ని సర్దుబాటు చేసుకుంటారని, ఆ సినిమా విజయానికి తోడ్పడేవారని అంటున్నారు. చెల్లింపుల విషయంలో కూడా నిర్మాతలను ఒత్తిడి చేసేవారుకాదు. ఆయనకు నిర్మాతలిచ్చిన చెల్లని చెక్కులు బీరువా నిండేన్ని అవుతాయట. ఖాతాలో బ్యాలెన్స్ లేకుండా చెక్కు ఎలా ఇచ్చారని అడగకుండా ఎవరి కష్టాలు ఏంటో అని వదిలివేసేవారని అంటారు.

వృత్తి నిబద్ధత పట్ల కృష్ణ గురించి ఎంత చెప్పిన తక్కువే. మూడు షిఫ్టులు చేస్తున్న కాలంలో తాను కొంతసేపు నిద్ర పోతానంటే మా సినిమాలో మీరు నిద్రపోయే సీన్ కూడా ఉంది. ఈ కాస్ట్యూమ్స్ వేసుకొని పడుకోండి అని అడిగితే కూడా ఓపిగ్గా సహకరించేవారట. వేసవిలో కుటుంబంతో ఊటీకి వెళితే అక్కడే పాటలు చిత్రీకరణ చేద్దామని నిర్మాతలు అడిగితే సరేనన్నారు. చేసే ప్రతి సినిమా తన సినిమా అని ఆయన భావించడం వల్లే ఇది సాధ్యపడిందని సినీజీవులు గుర్తు చేసుకుంటున్నారు.
కృష్ణ ఆలోచనల్లో సామాజిక కోణం సూచించింది. ఎలాంటి తారతమ్యాలు లేని ఆయన విశాల దృక్పథం ఆయన సినిమాల్లో కనబడుతుంది. తాను చేయాలనుకున్న ఛత్రపతి శివాజీ సినిమాలో ఔరంగజేబు పాత్ర చిత్రణ వల్ల ఒక వర్గపు మనోభావాలు గాయపడతాయని భావించి ఆ చిత్ర నిర్మాణమే విరమించుకున్నారట. ఒక సినిమాలో ఆయన పాత్ర ‘అంబేడ్కర్ ఒక్క మాలమాదిగలకే నాయకుడు కాదు.

కమ్మకు, కాపుకి, రెడ్డికి, యానాదికి, హిందూకు, ముస్లింకి, క్రైస్తవులకు ప్రతివాడికి నాయకుడు అంబేడ్కర్. అలాంటి గొప్ప నాయకుడిని దళితులకు మాత్రమే పరిమితం చేశారు’ అని పలుకుతుంది. ఈ డైలాగ్ అనడానికి తెలుగులో మరే ఇతర హీరోలు సాహసించలేరు. సినిమా నిర్మాణంలోనే కాదు వ్యక్తిగా సామాజిక బాధ్యతలోనూ ఆయనకు స్పష్టత ఉంది. తన ఆస్తిని పక్కనబెట్టి కృష్ణ నివాసం ఉంటున్న నానక్ రామ్ గూడ ప్రజలతో ఆయన ఎంతో కలుపుగోలుగా ఉంటూ అన్ని వేడుకల్లో పాలు పంచుకుంటారని ఆ కాలనీవాసులు అంటున్నారు. ఈ ఔన్నత్యం అందరికీ సాధ్యపడదు. ఏ ఆలోచనలతో కృష్ణ ఆ మహోన్నత మానవీయ శిఖరాన్నిఅందుకున్నారో కానీ ఉత్తమ నటుల మధ్య ఉత్తమ మనిషిగా ఎదిగిన క్రమం అందరికీ ఆదర్శనీయం. నటన వృత్తి, సంపాదన కృషి ఫలం, అదంతా నాదే అనుకోవడం స్వార్థం. అలాంటివారు మనిషిగా అవతరించే విద్యను కృష్ణ ఎనభయేళ్ల జీవితం నేర్పుతుంది.

 

 

[ad_2]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments