ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు అనూహ్య మలుపులు లేకుండా డైరెక్ట్ ముఖాముఖీ తలపడే విధం గా సాగుతున్నాయి . కేంద్ర భాజాపా అండ తో వైకాపా ప్రభుత్వం ఈ నాలుగేళ్లు చేతిలో వున్న పోలీసు వ్యవస్థ తో పరిపాలన తాము అనుకొన్న రీతిలో సాగించారు . ప్రభుత్వ సొమ్ము నీకింత నాకింత అని పంచడానికి ప్రజాస్వామ్యం , ఎన్నికలూ ఎందుకో ప్రజాస్వామ్య వాదులకు అర్ధం కావడంలేదు . పల్నాడులో చలో ఆత్మకూరు పిలుపు ఇవ్వగానే , చంద్రబాబు నాయుడి ఇంటికి తాళం వేసి హౌస్ అరెస్ట్ చేసి ఇప్పటికి 48 నెలలు .
ఆనాటి నుంచీ నేటివరకూ పార్టీ నాయకులనూ , కార్యకర్తలనూ కంటికి రెప్పలా కాపాడుకొంటూ వున్న చంద్రబాబు నాయుడి నిబద్దత కు కొలమానం లేదు . నిజానికి తెలుగుదేశం ఆవిర్భావం తరువాత ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని గత 4 ఏళ్ళగా ఎదుర్కోవాల్సి వచ్చింది . కానీ క్షేత్రస్థాయిలో తెలుగుదేశానికి ఉన్నబలమైన క్యాడర్, బడుగు బలహీన వర్గాల పార్టీ గా వున్నా పేరు , ఆ పార్టీ కి ప్రజలు వెన్నంటి ఉండడానికి కారణమైంది . దీనికి తోడు అధికార వైకాపా స్వయంకృత తప్పిదాలతో టీడీపీకి ప్రజల్లో సానుభూతి పెరిగింది . అగ్నికి ఆజ్యం తోడయినట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి రథయాత్ర 3rd ఫేజ్ జోరుగా ఉత్తరాంధ్ర లో సాగుతోంది . వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ఇ లక్ష్యం గా ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అని ఢంకా బజాయుంచి చెబుతున్నారు . ఇక యువనేత నారా లోకేష్ యువగళం ప్రజల హారతులు నీరాజనాల మధ్య జైత్రయాత్ర లా పల్నాడు జిల్లాలో సాగుతోంది .
చింత చచ్చినా పులుపు చావని చందాన అధికార మత్తు లో వున్న వారిని చూస్తే ఈ క్రింది పద్యమొకటి వీరికోసమే రాశారా అనిపిస్తోంది …
విధి సంకల్పముచే నొకానొకడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువ , చూపు తక్కువ , సదా భాషల్ దురూక్తుల్, మనో
వ్యధతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందు న
య్యధి కారాంతమునందు చూడ వలె నయ్యంగారి సౌభాగ్యముల్ !
పూర్వజన్మ సుకృతమువల్ల అధికారము ప్రాప్తించిన వాడికి చెవుడు, చూపు కూడా మందగించి, గర్వముతో ఎప్పుడూ దుర్భాషలాడుతూ, చెడ్డ పనులు చేస్తుంటాడు. ఆ అధికారము పోయిన తర్వాత చూడాలి అతని సంగతి. ఇది చక్కగా మన పాలకులకు నప్పుతుంది . ఇప్పుడు అధికార పక్షాల పరిస్థితి ఎలా ఉందంటే ప్రతిపక్ష చతుర్ముఖ దాడిలో దిక్కు తోచక కొట్టుమిట్టాడుతున్నారు .
ఇకనైనా పాలకులు మేలుకొని , వున్నా నాలుగు నెలలు ప్రజలకు మంచి చేయాలని కోరుకొందాము .