నిండు కొలువులో నువ్వా – నేనా (రేవంత్ VS కెసిఆర్)
రాబోయే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జోరుగా డి అంటే డి అనేలా జరిగే అవకాశమున్నది. అధికార , ప్రతిపక్ష నేతల మధ్య ముదరుతున్న మాటల తూటాలా యుద్ధం అసెంబ్లీ సాక్షిగా మరింత వేడెక్కే అవకాశం ఉంది . కేసీఆర్ 10 ఏళ్ళ పరిపాలనలో అన్ని విధాలా నష్టపోయాము అని జరిగిన వైఫల్యాలను ఎత్తి చూపించి , ఉభయ రాష్ట్రాలు కలిసిఉన్నపుడు కంటే ఈ పదేళ్లలో ఘోరమైన అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ టార్గెట్ చేసే అవకాశమున్నది,
ఆ దిశగా పలు కామెంట్స్ కూడా చేసారు . దీనికి గట్టిగా ప్రతిదానికి కౌంటర్ ఇచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. దానికి అనుగుణముగా తెలంగాణ భవన్లో మంగళవారం కొన్ని కామెంట్స్ చేశారు కెసిఆర్ . మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గులాబీ దళపతి కేసీఆర్ సభలోకి అడుగుపెట్టనున్నారు .
అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్ రావడంపై బీఆర్ఎస్ నేతల మధ్యే కాక రాష్ట్రమంతా చర్చ జరుగుతున్న సందర్బములో కచ్చితంగా హాజరు అవుతారంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు . పోయిన వారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన గులాబీ దళపతి మొదటిసారి తెలంగాణ భవన్‌కు వచ్చి తన పార్టీ నేతలతో మీటింగ్‌లో పాల్గొన్నారు . కృష్ణా జలాల విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు కెసిఆర్ .
పదేండ్ల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ప్రజలను పరిరక్షించామని, ముందుముందు కూడా అదే నిబద్దతతో ఉంటామని నేతలకు కెసిఆర్ భరోసా ఇచ్చారు . కృష్ణా జలాల వివాదంపై నల్లగొండ జిల్లాలో వచ్చే వారం భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు . సీఎం రేవంత్ వ్యూహానికి , నువ్వా నేనా అన్నట్లు కేసీఆర్ కౌంటర్ ఉంటుంది అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
పదేండ్ల కాలం లీడర్ ఆఫ్ ది హౌజ్‌గా ఉన్న కేసీఆర్ నేడు మొదటిసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో దర్శనమివ్వనున్నారు. కేసీఆర్ కూర్చున్న ఆ సీటులో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కనిపిస్తారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటిసారి ప్రతిపక్ష హోదాల రేవంత్‌రెడ్డి, అధికార దర్పంతో కేసీఆర్ కనిపించిన దృశ్యాలు ఈసారి పూర్తీ విరుద్ధముగా సభలో కనిపించనున్నాయి.
కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేలా రేవంత్ వ్యూహం ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ,
పదేండ్ల కెసిఆర్ పరిపాలనలో ప్రాజెక్టుల రీడిజైన్, లక్షల కోట్ల ప్రజాదనం దుర్వినియోగం, కమిషన్ల కోసం కక్కుర్తి పడి నాణ్యతను నామరూపాలు లేకుండా చెయ్యటం , రాష్ట్రాన్ని కుప్పలా తెప్పలుగా అప్పులపాలు చేయడం వంటి మాటలతో కేసీఆర్‌ను ఇప్పటికే విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి .. అసెంబ్లీ వేదికగ పెన్ పేపర్ పెట్టి గత ప్రభుత్వ కెసిఆర్ పరిపాలనలోని వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు సీఎం రేవంత్ . లక్ష కోట్ల ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ,కనీసం ఆ ప్రాజెక్ట్ ద్వారా లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని ,కట్టిన మూడు బ్యారేజీలూ ఎందుకూ ఉపయోగ పడకుండా పోయాయని మంత్రి ఉత్తమ్ కూమార్ రెడ్డి కూడా ఈ మధ్యఫైర్ అయ్యారు. ఈ అంశాలన్నింటినీ రాబోయే అసెంబ్లీలో ఆధారాలతో ప్రస్తావించి కేసీఆర్‌ను, ఆనాటి ఇరిగేషన్ మంత్రిని పక్క లెక్కలతో , ఆధారాలతో ఎండగట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాన్ని సిద్ధంచేసుకుంటున్నది అని సమాచారం .
గత పాలనలోని వైఫల్యాలకు ప్రధానమైన వ్యక్తి కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేయాలనుకోవడం, దానికి దీటుగా జవాబు ఇచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో కేసీఆర్ నిలబడడం ఈ సమావేశాల్లో స్పెషల్గ చూడాల్సి వస్తుంది .
వీళ్లిద్దరి మధ్య జరిగే వాడివేడి రాజకీయ చర్చలపైనే తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టి ఉంటుంది . ఈ రాజకీయ చర్చల్లో భాగముగా ఓడేదెవరు ?.. గెలిచేదెవరు ?.. ఇక్కడ ఎవరి వాక్చాతుర్యంతో ఎవరు చట్టసభను ఏ డైరెక్షన్లోకి తీసుకువెళతారో .. తమ నాయకులను ప్రొటెక్ట్ చెయ్యడానికి కాంగ్రెస్ BRS ఎమ్మెల్యేల యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుంది.. ఎవరు ఎవరిని దోషిగా చట్టసభలో నిలబెడతారు.. ఇలాంటివాటి చుట్టే రాజకీయ చర్చలు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లలో జరుగుతాయి .
రెండు రోజులు అసెంబ్లీలో చర్చించడానికి తానూ సిద్ధమేనంటూ గులాబీ దళపతి కెసిఆర్ ని రేవంత్ ఇప్పటికే ఉచ్చులోకి లాగారు. గులాబీ దళపతి కేసీఆర్ మాత్రం తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని అంతర్మథనంలో ఉన్నట్లు సమాచారం .