తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మిత్రుడైన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను గురువారం నాడు మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. ఆయన వెంట కుమారుడు భద్రారెడ్డి కూడా ఉన్నారు. ఐతే తెలంగాణాలో రేవంత్ సర్కార్ కొలువుదీరాటంతో, పార్టీ మారాలని చూస్తున్న బారాసా శ్రేణులకు.. కేసీఆర్, కేటీఆర్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ. తమ రాజకీయ భవిష్యత్తును చూసుకుంటూ కొంతమంది కాంగ్రెస్ బాట పడితే మరికొందరు బీజేపీ బాట పట్టారు. ఇదే క్రమంలో కారి దిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు మల్లారెడ్డి గత కొద్ది రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో డీకేని నిన్న మేడ్చల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మల్లారెడ్డి కుంటుంబ సభ్యులు ప్రియాంక గాంధీ అపాయిమెంట్ తీసుకున్నట్లు సమచారం. సీఎం రేవంత్ మల్లారెడ్డిని పట్టించుకోకపోవటంతో.. డీకేతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాయబారం నడుపుతున్నట్లు తెలిసింది. కర్నాటక రాష్టానికే చెందిన తన చిన్న కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి ద్వారా డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే డీకే శివకుమార్ ఒక వేళ పార్టీ పెద్దలను ఒప్పించగలిగితే లోక్ సభ ఎన్నికల ముందే కాంగ్రెస్‌లో చేరాలని మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర మంత్రి వర్గంలోని ఓ కీలక మంత్రిని ఈ నెల 4వ తేదీన మల్లారెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ భద్రారెడ్డిలు రహస్యంగా కలిసినట్లు టాక్. తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని మల్లారెడ్డి సదరు మంత్రిని అభ్యర్థించినట్లు తెలిసింది.
తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్‌తో పాటు తనకు మంత్రి పదవి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే మంత్రి మాత్రం మీ రాకను పార్టీ పెద్దలు ఒప్పుకోక పోవచ్చని, కానీ తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. సీఎంను ఎలాగైనా ఒప్పించాలని, లేకపోతే ఢల్లీి స్థాయిలో తన కోసం ప్రయత్నాలు చేయాలని మల్లారెడ్డి కోరినట్లు తెలిసింది. మరి మల్లారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలన్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.