తెలంగాణ భాజాపా కు ఇబ్బందులు తప్పేట్లు లేవు . ఒక్కరొక్కరు పార్టీని ఎన్నికల వేళ వీడటం కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి ఇబ్బందికరం గా మారింది . వున్న వారిని కాపాడుకోలేక , కొత్తవారు రాక భాజాపా ఇబ్బందులు పడుతోంది . మాజీ మంత్రి సీనియర్ దళిత నేత చంద్రశేఖర్ బిజెపిని విడిచిపెట్టిన రెండు రోజుల తదుపరి , ఆర్మూర్ నియోజకవర్గ బిజెపి ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నిన్న భాజాపా కు రాజీనామా చేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వినయ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు . వినయ్ కుమార్ రెడ్డి రాజీనామా పత్రాన్ని సరాసరి పార్టీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి పంపారు. నిజామాబాద్ ఎంపీ డి అరవింద్‌తో ఆయనకు గల విభేదాల కారణంగా రాజీనామా చేస్తున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆర్మూరు నియోజక వర్గం లో 13 ఎంపీటీసీ , 1 జడ్పీటీసీ ని గెలిపించుకోవడం జరిగిందని ఆయన లేఖలో గుర్తు చేశారు . తనతో కలసి పనిచేసే మండల పార్టీ అధ్యక్షులను తొలగించారన్నారు .
త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల్లో ఆర్మూర్ స్థానంపై ఎంపీ అరవింద్ కన్నేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం రాజీ నామా చేసిన వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని స్థానికం గా ప్రచారం జరుగుతోంది. 2019లోకసభ ఎన్నికల్లో ఆర్మూరు లో భాజాపా కు 32000 ఓట్ల మెజారిటీ వచ్చిన విషయం తెలిసిందే కదా .