Saturday, August 13, 2022
spot_img
HomeDevotionalమెతుకు వృద్ధా కాకుండా 50లక్షలమందికి భోజనమా... !

మెతుకు వృద్ధా కాకుండా 50లక్షలమందికి భోజనమా… !

కురుక్షేత్ర యుద్ధంలో ఉడిపిరాజు నరేశుని చేతివాటం .... శ్రీకృషుడు తినే పెసరకాయల్లోనే అసలు రహస్యం

‘వంట’ అనేది ప్రతి ఇంటిలోనూ వుండే ఒక ముఖ్యమైన ప్రక్రియ. సాధారణ గృహాలలో వంటలు మహిళలే చేయటం ఆనవాయితీగా వస్తున్నది. అయితే పురాణాలలో మహిళలకంటే మగవారే వంటలలో ప్రావీణ్యం గడించినట్టు ఎన్నో నిదర్శనాలున్నాయి. వర్తమాన కాలంలోనూ హోటల్లు, రెస్టారెంట్ లు, పెద్ద పెద్ద స్టార్ హోటల్ లలో వంటమాస్టరు (చెఫ్) లుగా మగవారే వుండటం మనం చూస్తున్నాం. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలను వినియోగించుకొని ఎంతమందికైనా క్షణాల్లో వంట చేసేందుకు ఇప్పుడు వెసులుబాటు వుంది. ఏవిధమైన సౌకర్యాలు అందుబాటులో లేని ప్రాచీన కాలంలో యుద్ధ సమయాలలో వేలు, లక్షలాదిగా వున్నవారికి ఆహార పదార్ధాలు ఏవిధంగా అందించేవారు? అన్న సందేహం కలగక మానదు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో వున్న కృష్ణమందిరంలో వినిపించే మహాభారత కధనంలో ఈ విషయాన్ని చక్కగా వివరిస్తుంటారు.

మహాభారత యుద్ధంలో కౌరవ, పాండవ సేనలు హోరాహోరీగా తలపడుతున్న రోజులవి. ఇరుపక్షాలలో దాదాపు 50లక్షల మందికి పైగా సైనికులు పాల్గొన్నట్టు మహాభారతంలో పేర్కొన్నారు. మహాభారత యుద్ధం జరిగినన్ని రోజులు వారందరికి భోజనాలు ఎవరు సిద్ధం చేశారు? అన్న సందేహం కలగక మానదు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పక్షాన కొందరు, పాండవుల పక్షాన మరికొందరు రాజులు వారి సేనలతో కలసి వచ్చి యుద్ధంలో పాల్గొన్నారు. ఆ క్రమంలోనే ఉడిపి రాజైన నరేషుడు తన సైన్యంతో యుద్ధరంగానికి వచ్చాడు. నరేశుని తమవైపుకు రావాల్సిందిగా ఇరుపక్షాలు ఆహ్వానించాయి. అయితే నరేషుడు సలహాకోసం శ్రీకృష్ణుని ఆశ్రయిస్తాడు. అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అందుకు నరేషుడు ఇప్పుడు జరుగుతున్నఈమహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది,నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు. అందువల్ల నేను, నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము.వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు చెపుతాడు. శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచనచాలా అద్భుతమైనది,50 లక్షల మందికి భోజనం వండటం అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది, భోజనాలు తయారుచేయమని చెపుతాడు.

50 లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు, అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది. కానీ ఈ సమయంలో పోరాడటం
భీముడుకు ముఖ్యం. భీముడు యుద్ధక్షేత్రం వదిలి రాలేడు.అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీకృష్ణుడు. నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు. నరేష్ ఎలా వండేవాడు అంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా,వృధాకాకుండా వండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేశుడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు. ఇది ఎలా సాధ్యం?అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు, ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు.

ఈ రోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని,మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని? అసలు నరేశునికి ఎలా తెలుస్తుంది? ఆ విధంగా 18 రోజులు గడిచిపోయాయి.పాండవులు గెలిచారు.పట్టాభిషేకం జరుగుతుంది.అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు. కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు.ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అంటాడు.

అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగాడు. అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికి చెందుతుంది అని చెప్తాడు.
అప్పుడు నరేష్ మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం.కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణుని కే చెందుతుంది అని చెప్తాడు. ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా కారణం అని నరేషుడుని అడుగుతారు. అప్పుడునరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు చెప్తాడు…

శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.నేను లెక్క పెట్టి పెట్టే వాడిని. శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని. శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలుఅయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు. ఆంటే
శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు. దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు. ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు. ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments