సీఎం రేవంత్ కి జై కొట్టిన కడియం శ్రీహరి..?
తెలంగాణ అసెంబ్లీలో గత నాలుగైదు రోజుల నుండి వాడీవేడీగా బడ్జెట్ సమావేశాలు సాగుతున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు బీఆర్ఎస్ ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తుండగా… ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం సభలో మాట్లాడిన మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు నేను నా మిత్రుడు రేవంత్ రెడ్డి ఒకే హస్టల్ లో ఉండేవాళ్లం. నేను సీనియర్ స్టూడెంట్, రేవంత్ రెడ్డి జూనియర్ స్టూడెంట్ గా ఉండే అంటూ రేవంత్ పై పొగడ్తలు గుప్పించారు కడియం. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రేవంత్ కి జై కొట్టారు. మావైపు నుంచి రేవంత్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ.. రేవంత్ రెడ్డి… ఆ పార్టీ వాళ్లతోనే జాగ్రత్తగా ఉండాలి అంటూ రేవంత్ సాబ్ కి సలహా ఇచ్చారు. ఇదే క్రమంలో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ వేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ ఇంతవరకు దానికి సంబంధించి ఎలాంటి ప్రక్రియ మొదలు కాలేదని అన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్ పై జరిగిన చర్చలో కడియం మాట్లాడారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ ఉద్యోగాలను ఏ రకంగా భర్తీ చేయబోతుందో బడ్జెట్ లో చెప్పలేదని అన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారని అన్నారు. ఉద్యోగాల క్రెడిట్ ను కాంగ్రెస్ తన బాక్స్ లో వేసుకోవడం సరికాదని అన్నారు. ఒక్క నోటిఫికేషన్ కు కూడా ఇవ్వకుండా తామే ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులకు మస్తీ ఎక్కిందని కోమటిరెడ్డి అనడం మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తగదని కడియం అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయినందుకు చాలా సంతోషపడ్డానని, అయితే కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ జాగ్రత్తగా ఉండాలని రేవంత్ కి స్వీట్ హెచ్చరిక చేసారు కడియం శ్రీహరి.