జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఉత్తరాంద్ర లో వారాహి విజయ యాత్ర మూడో విడత లో భాగం గా నిన్న ఆయన గాజువాకలో ప్రసంగించారు. ప్రజలు ఈ సభకు పోటెత్తారు . జనసేనాని జగన్ పై , వాలంటీర్ల వ్యవస్థ పై తీవ్రం గా విరుచుకు పడ్డారు . ఆయన మాటల్లో “
ఎన్నికల ముందు బుగ్గలు నిమురుతుంటే, కనిపించిన వారిందరికీ ముద్దులు పెడుతుంటే దేవుడొచ్చాడనుకున్నారు. జగన్ రెడ్డిని నమ్మారు. 151 సీట్లను ఇచ్చి దేవుడుకి దణ్ణం పెట్టారు. జగన్ పాలన మొదలయ్యాక ప్రజలకు అర్ధం అయింది.. ఈయన దేవుడు కాదు.. దెయ్యమై భుజాల మీదకెక్కాడు అని తెలుకున్నారు. జగన్‌కు అదృష్టం అందలం ఎక్కిస్తే… బుద్ధి బురదలోకి లాక్కెళ్లింది. జగన్‌ను ప్రజలు మరో ఆరో నెలలు భరించక తప్పదు. జగన్ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు చూస్తూ ఉండక తప్పదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం మనసులో ఆ దెయ్యం మీద ఉన్న కోపాన్ని ఓట్ల రూపంలో వేసి తరిమికొట్టండి”
విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ సమస్య మీద జగన్ కేంద్ర పెద్దలతో మాట్లాడలేడు. వారి వద్దకు వెళ్లి సొంత గనులు కేటాయించమని అడగలేడు. ఎందుకంటే భయం. విపరీతమైన భయం. చుట్టూ అవినీతి కేసులు… హత్యలు చేయించిన చరిత్రలు… భూములు కాజేసిన ఘనతలు ఉన్న వాడికి భయం కాక ఇంకేం ఉంటుంది..? కానీ నేను కేంద్ర పెద్దలతో మాట్లాడాను. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంశం తెరపైకి రాగానే, ఢిల్లీ వెళ్లి నాకున్న పరిచయాలతో కేంద్ర పెద్దలను కలిశాను. స్టీల్ ప్లాంటు అనేది కేవలం ఓ పరిశ్రమ కాదని, 32 మంది ప్రాణ త్యాగాలతో ముడిపడి ఉన్న భావోద్వేగ అంశమని కేంద్ర పెద్దలకు తెలియజేశాను. ఈయనకు 22 మంది ఎంపీలను ఇచ్చినా ఒక్కసారి కూడా కనీసం పార్లమెంటులో తన సభ్యుల చేత ప్లకార్డులు పట్టించలేకపోయాడు. విశాఖ స్టీల్ ప్లాంటు మనకు ఎంత అవసరమో చెప్పలేకపోయాడు. 1970ల నుంచి మూడు తరాలుగా విశాఖ ఉక్కు- ఆంధ్రా హక్కు అనే నినాదాన్ని ఇప్పటికీ మన గుండెల్లో ఉండిపోయింది. దాన్ని కనీసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి అంటే.. చట్టసభల్లో మాట్లాడాలి అంటే తగిన ఎంపీల బలం నాకు లేకపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ కానీ, హోం మంత్రి అమిత్ షా కానీ నేను చెప్పిన మాట వింటారు.. ఆలకిస్తారు. అయితే చట్టసభల్లో ఈ అంశాలపై మాట్లాడే అవకాశం జనసేనకు లేకపోయింది” అన్నారు పవన్ .
ఇంకా “విశాఖలో దసపల్లా, సిరిపురం, రుషికొండ లాంటి విలువైన భూములను కళ్లెదుటే దోచేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని విలువైన భూముల మీద వైసీపీ కన్ను పడింది. మొదటిగా విశాఖను దోచుకొని తర్వాత మిగిలిన ప్రాంతాలను దోచేస్తారు. ఉత్తరాంధ్రలో కీలకమైన బీసీ కులాలను తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగిస్తే, ఆ ముఖ్యమంత్రితో కనీసం మాట్లాడలేకపోయిన జగన్ ఉత్తరాంధ్ర మీద చూపిస్తున్న కపట ప్రేమను ప్రజలు అర్ధం చేసుకోండి. తెలంగాణలోని జగన్ కు ఉన్న రూ.300 కోట్ల సొంత ఆస్తుల రక్షించుకోవడం కోసం, రెండు రాష్ట్రాల మధ్య మిగిలిపోయిన రూ.లక్ష కోట్ల ఆస్తుల పంపకాన్ని కనీసం అడగని వ్యక్తి జగన్. నేను ఏమైనా మాట్లాడితే నా మీద నోరు వేసుకొని పడిపోవడం వైసీపీ నేతలకు తెలుసు. నన్ను, నా వ్యక్తిగత జీవితాన్ని, నా తల్లిని, పిల్లలను తిట్టించినా నేనేమీ భయపడి పారిపోయేవాడిని కాదు. ప్రజా సమస్యలను ఎత్తి చూపడంలో, ప్రజాక్షేత్రంలో మీ అసలు రంగు బయటపెట్టడంలో నేను మొండివాడిని. దేనికి అసలు తలవంచేవాడిని కాదు” అన్నారు .
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాకా దాదాపు 30వేల మంది మహిళలు అదృశ్యమైపోయారు అని నేను ఏలూరులో మాట్లాడితే నా మీద వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా నేను చెప్పింది నిజమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పారు. ప్రజల ప్రైవేటు డేటాను ఎలా సేకరిస్తారని 2019 ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. ఇప్పుడు నేను అడుగుతున్నది అదే కదా..? వాలంటీర్ వ్యవస్థపై నేను మొదటి నుంచి అడుగుతున్నది మూడే మూడు ప్రశ్నలు. వాలంటీర్ల వ్యవస్థకు బాస్ ఎవరు? వాలంటీర్లు సేకరిస్తున్న డేటా ఎక్కడికి వెళ్తుంది? వారికి జీతాలు ఏ అకౌంట్స్ నుంచి ఇస్తున్నారు? వీటికి సమాధానం చెప్పమంటే వీటికి తప్ప మిగతా అన్ని విషయాలపై వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు” అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.