నేరాలకు అడ్డాగా ఏపీ మారిపోతోందని..గంజాయి మాఫియాగా ఏపీని మార్చేశారని తీవ్రంగా మండిపడ్డ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో వినూత్న కార్యక్రమం చేపట్టనున్నారు. అదే ప్రజా కోర్టు . మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన వీర మహిళలతో సమావేశమైన పవన్ కళ్యాన్ త్వరలో ప్రజాకోర్టు చేపడతామని , ఇది సోషల్ మీడియాలో ను..అలాగే సందర్భానుసారంగా.. కొన్నిసార్లు బయట కూడా కార్యక్రమం చేస్తామన్నారు .
ఎవరైతే తప్పులు చేస్తారో.. ప్రజాకోర్టులో ఏయే చట్టాల కింద వీరికి శిక్ష పడాలి? రాజ్యాంగంలో ఉల్లంఘన ఎలా జరుగుతుంది? అనే దానిపై ప్రజా కోర్టు ఉంటుంది. తప్పు జరిగినప్పుడు ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిది అంటూ పవన్ దిశానిర్ధేశం చేశారు. అటువంటి బాధ్యతలు తెలిసేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలకు నేర్పాలని సూచించారు.తాము అధికారంలోకి రాగానే మహిళలు, పిల్లలకు మరింత భద్రత కల్పిస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.
తన సోదరిని వేధిస్తున్నవారిని ప్రశ్నించినందుకు 14ఏళ్ల బాలుడిని హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారని ఇటువంటి దరాగతాలకు పాల్పడేవారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమాజంలో తప్పు చేసినవారిని ప్రశ్నించే గుణాన్ని అలవర్చుకోవాలని ఇది ప్రతీ ఒక్కరి బాద్యత అని అన్నారు. తప్పు చేస్తే శిక్ష పడాలని..మరోసారి తప్పు చేయకుండా ఉండేలా శిక్ష పడాలని అన్నారు.
30 వేల మంది మహిళలు అదృశ్యమైనా ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ విషయంపై మాట్లాడితే తనకు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. నోటీసులు ఇచ్చినా..కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు పవన్ .