Saturday, August 13, 2022
spot_img
HomeNewsఆర్ ఆర్ ఆర్ అంటే ఎందుకంత ఉలికిపాటు?

ఆర్ ఆర్ ఆర్ అంటే ఎందుకంత ఉలికిపాటు?

రాష్ట్రాలో అడుగుపెడితే అరెస్టు చేస్తారన్న అనుమానాలు .... ప్రధాని పర్యటనలో రఘురామ పాల్గొనటంపై తొలగని సస్పెన్స్ !

ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ జులై 4వ తేదీన నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి రానున్నారు. ప్రోటోకాల్ ప్రకారం అక్కడి ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధానికి స్వాగతం పలికి స్థానికంగా జరిగే కార్యక్రమాలకు అధ్యక్షత వహించాల్సి వుంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రఘురామ కృష్ణంరాజు స్వంత నియోజకవర్గానికి వచ్చే పరిస్తితి లేదు. రఘురామకృష్ణంరాజు వస్తే ఆయనపై నమోదైన కేసులకు సంబందించి అరెస్టు చేయాలని అధికారులు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి తీరాలని ఎంపీ పట్టుదలతో వున్నట్టు అవగతం అవుతున్నది. ఒక ఎంపీ తన స్వంత నియోజకవర్గానికి వెళితే, దానివల్ల అధికార పార్టీకి తలెత్తే ఇబ్బంది ఏమిటి? రఘురామను చూసి ఎందుకంత ఉలికిపాటు? రఘురామ విషయంలో కొంతమంది ప్రభుత్వ పెద్దలు వ్యక్తిగత ప్రతిష్టకు పోతున్నారా? అన్న అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశగా మారాయి.

రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపి తరపున నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన రఘురామకృష్ణంరాజు వివిధ కారణాలతో స్వంత పార్టీతో విభేదించారు. ఒకానొక సందర్భంలో రఘురామపై నమోదైన కేసుకు సంబందించి సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్టు ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు ఒక ఎంపినే పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేయటంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ నేపధ్యంలోనే రఘురామకృష్ణంరాజుకు స్వంత పార్టీ అయిన వైసీపీ కి మధ్య అగాధం పెరగసాగింది. రఘురామ వ్యవహారాన్ని వైసీపీలో కొంతమంది అగ్రనాయకులు వ్యక్తిగతంగా తీసుకొని పట్టుదలకు పోతున్న సూచనలు కన్పిస్తున్నాయి. అవకాశం చిక్కినప్పుడల్లా రఘురామరాజు రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదులు చేయటంతో పాటు వ్యక్తిగతంగా న్యాయస్థానాలలో పిల్, రిట్ పిటీషన్ లు సైతం దాఖలు చేస్తూ ముప్పుతిప్పలు పెట్టసాగారు. రఘురామ వ్యవహారం అధికారపార్టీ నేతలకు మింగుడుపడని వ్యవహారంగా మారింది.

గత రెండు సంవత్సరాలుగా రఘురామకృష్ణంరాజు తాను ప్రాతినిద్యం వహిస్తున్న నరసాపురం నియోజకవర్గానికి వెళ్ళే పరిస్తితి లేదు. దీంతో రఘురామ హైదారాబాద్, డిల్లీలకే పరిమితం అయి అక్కడినుంచే నియోజకవర్గ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూ పనులు చక్కబెట్టనారంభించారు. అంతేగాక ప్రతిరోజూ రచ్చబండ పేరుతో రాష్ట్రప్రభుత్వ వైఖరిని ఉతికి ఆరేయసాగారు. అదేసమయంలో రఘురామను అనర్హునిగా ప్రకటించాలన్న అధికారపార్టీ నాయకుల ప్రయత్నాలు విఫలం కావటంతో వారికి పుండుమీద కారం చల్లినట్టయింది. రఘురామను అరెస్ట్ చేసేందుకు కాచుక్కూర్చున్నారన్న చర్చ జరుగుతున్నది.

వాస్తవానికి ప్రధాని పర్యటనలో పాల్గొనేందుకు వీల్లేదని రఘురామకు అధికార పార్టీ నాయకులు ఎవరూ బాహాటంగా అల్టిమేటం ఇవ్వలేదు. అయినప్పటికి రఘురామ తనకున్న నెట్వర్క్ సహాయంతో తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకున్నారు. ఇదే విషయాన్ని రఘురామ ప్రధానికి రాసిన లేఖలో వెల్లడించటమే గాక, సామాజిక మాధ్యమాల ద్వారా బహిర్గత పరిచారు. తనను నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకోవటమంటే ఒక పార్లమెంట్ సభ్యునికున్న హక్కులను హరించటమేనని రఘురామ ధ్వజమెత్తుతున్నారు. రఘురామపై ప్రస్తుతం నమోదై వున్న కేసులకు సంబంధించి అరెస్టు కాకుండా స్టే కొనసాగుతున్నది. అయినప్పటికి మరికొన్నికేసులు నమోదుచేసి అరెస్టు చేసేందుకు ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు కుట్రపన్నుతున్నారన్నది రఘురామ ఆరోపణగా వున్నది. ఈ పరిణామాల నేపధ్యంలోనే నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో జరుగనున్న ప్రధాని మోడీ పర్యటనలో రఘురామ పాల్గొంటారా? లేదా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments