ఈ చరా చర జగత్తు లోని చీకట్లను పారద్రోలుతూ వెలుగునిచ్చే సూర్యనారాయణుని ప్రత్యక్ష దైవం గా భావించి ఆరాధించడమనేది ప్రాచీనకాలం నుంచి వుంది. మన వైదిక జగత్తులో ఇంద్రాది దేవతలు … మహర్షులు సూర్యుడికి నమస్కరించుకున్న తరువాతనే తమ దైనందిన కార్యక్రమాలు ప్రారంభించేవారు . ప్రకృతిని ప్రభావితం చేసి , జీవరాశికి కావలసిన ఆహారాన్ని అందించేది సూర్యునారాయణుడే .. అందుకే ప్రత్యక్ష దైవం గా తలంచి అందరూ సూర్య ఆరాధనా చేయడం తెలిసిందే .
ఈ సూర్య ఆరాధన ఆదివారం చేస్తే చాలా మంచిది . సూర్య భగవానుని ఆరాధనకు ఆదివారం ఉత్తమమైన రోజుగా మన పూర్వీకులు భావించారు . జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుని అన్ని గ్రహాలకు రాజు . నవగ్రహాలకు అధిపతి సూర్యుడు . సూర్య భగవానుని అనుగ్రహం తో వ్యక్తి జీవితంలో చాలా అభివృద్ధి చెంది , వారి ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుంటుంది. జాతక చక్రం లో సూర్యుడు బలంగా ఉంటే వారికి సుఖసంతోషాలు, ఐశ్వర్యం, కీర్తి లభిస్తాయి. అదే సమయంలో, సూర్యుడు బలహీనం గా ఉంటే.. వ్యక్తులు తరచుగా అనారోగ్యంతో బాధపడుతుంటారు. ఏ పని కూడా విజయవంతం అవదు. అయితే, ఇలాంటి చెడు దుష్ప్రభావాలకు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు. ఆదివారం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలన్నీ తొలగిపోతాయట. మరి ఆ చర్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- రోజూ ఉదయాన్నే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడంతోనే దినచర్య ప్రారంభించడం ఉత్తమమైన మార్గము .
- సూర్యోదయానికి గంటన్నర ముందు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి.
- ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యకిరణాలు తీవ్రంగా ఉండకూడదు. ముఖాముఖీ సూర్యని చూడగలిగే విధం గా ఉండాలి .
- లేలేత భానుడి కిరణాల వల్ల ఆధ్యాత్మికతతోపాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ( D విటమిన్ ) పొందుతారు .
- చేతులను సాధ్యమైనంత మేర పైకి లేపి అర్ఘ్యం ఇస్తే సూర్యుడి నుంచి విడుదలయ్యే ఏడు కిరణాల శరీరం గుండా ప్రసరిస్తాయి..
- దోసిలి నిండా మంచి నీరు తీసుకొని పైకి ఎత్తి , ఓం నమో సూర్యాయ నమ: మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ నీటిని సూర్యాభిముఖం గా చూస్తూ వదలాలి. పోసేటప్పుడు, మీరు పట్టుకున్న పాత్ర నుండి నీటి ప్రవాహం ద్వారా సూర్యుడిని చూడండి.
- రాగి పాత్రతో నీరు ( తేనె చుక్కలు కలిపిన నీరు ) ఉత్తమం .. గృహిణిమ్ సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని 11 సార్లు ఉచ్చరిస్తూ నమస్కారం చెయ్యండి .
- అర్ఘ్యం ఇచ్చిన జలం పడిన ప్రదేశంలో కుడిచేతి వేళ్లతో తాకి ఆ మట్టిని నుదుటిపై పూసుకోవాలి. అలాగే కళ్లు, మెడకు రాసుకోవాలి. మీ కాళ్ళ పై ఆ జలం పడకుండా చూసుకోండి .
- సూర్యుడికి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పుష్పాలు కలిగిన నీటితో అర్ఘ్యం ఇస్తే.. లక్ష్మీదేవి మీ వెంటే!
- సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం ఇంట్లో దీపారాధన చేస్తే మిక్కిలి మంచిది .
- కొంత మంది సాయంత్రం సూర్యునికి అర్ఘ్యం ఇస్తారు . ఉదయం ఇవ్వడం శ్రేయస్కరం … రెండు పూటలా ఇవ్వడం మిక్కిలి మంచిది .
॥ సూర్యార్ఘ్యమంత్రం ॥
ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే ।
అనుకంపయ మాం భక్త్యా గృహాణార్ఘ్యం దివాకర
॥ సూర్య, సహస్రాంశో, తేజోరాశే, జగత్పతే, ఏహి.
మాం అనుకంపయ. దివాకర, భక్త్యా అర్ఘ్యం గృహాణ ॥
ఓ సూర్యుడా, అనంతమైన కిరణాలుకలవాడా, వెలుగుల రాశీ, ప్రపంచానికి అధిపతీ, రావయ్యా. నన్ను కరుణించు. ఓ దివాకరా, భక్తిచేత (నేను ఇచ్చే ఈ) అర్ఘ్యం తీసుకో.
సూర్య గాయత్రీ మంత్రం :
ॐ ఆదిత్యాయ విద్మహే . భాస్కరాయ ధీమహి తన్నో భాను ప్రచోదయాత్ |