Saturday, August 13, 2022
spot_img
HomeEditorialఎపి లోనూ తెలంగాణ తరహా వ్యూహరచన

ఎపి లోనూ తెలంగాణ తరహా వ్యూహరచన

ఎపి కాంగ్రెస్ కు దిక్సూచిగా మారిన రేవంత్ రెడ్డి ..... ఎపి లో ఓటింగ్ శాతం పెంపు పై కాంగ్రెసు ఫోకస్

ఆంధ్రప్రదేశ్ లో ఎండిన మానులాగా వున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ చిగురిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో కెల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలీయంగా వుండి, దశాబ్దకాలం పాటు పాలన సాగించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవిభజన అనంతరం చిరునామా కోల్పోయింది. విభజన అనంతరం తెలంగాణ లో నామ మాత్రంగా వుంటే ఆంధ్రప్రదేశ్ లో అసలు ఉనికే కోల్పోయింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డి కి అప్పగించారు. అప్పటి నుంచి తెలంగాణ లో కాంగ్రెస్ దశ తిరగసాగింది. సంప్రదాయ, ఛాందసవాద రాజకీయాలకు భిన్నంగా తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కి కొత్త సొబగులు అద్దారు.

అదేసమయంలో ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన హేమాహేమీలు, రాజకీయంగా కాకలు తీరిన ఉద్దండులు అయిన నాయకులు వున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ జవసత్వాలు కూడగట్టుకొలేక పోతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి సారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు ఎన్ రఘువీరా రెడ్డి, డాక్టర్ సాకే శైలజానాథ్, డాక్టర్ డి ఎల్ రవీంద్రా రెడ్డి, డాక్టర్.చింతా మోహన్, డాక్టర్ ఎన్ తులసి రెడ్డి, ఎం ఎం పల్లం రాజు, వట్టి వసంత కుమార్, కనుమూరి బాపిరాజు, వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, వంటి వారితో పాటు షేక్ మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ వంటి గట్టి నాయకులు వున్నారు. లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి నాయకులు కాంగ్రెస్ ను వీడి తటస్థంగా వున్నారు. మరికొంతమంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ బిజేపి లో చేరి ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు సైతం నిర్వహించారు.

రాష్ట్ర విభజన అనంతరం 2014, 2019 ఎన్నికలలో కాంగ్రెస్ నాయకులు ఎవరూ సీరియస్ గా పని చేసిన దాఖలాలు లేవు. అదే సమయంలో జాతీయ స్థాయిలో బలంగా వున్న బిజేపి ఆంధ్రప్రదేశ్ లోనూ సర్వశక్తులూ ఒడ్డి పోరాడింది. 2019 ఎన్నికలలో బిజేపి కి 2 లక్షల 63వేల 849 ఓట్లు వస్తే, కాంగ్రెస్ పార్టీ కి 3 లక్షల 68వేల 810 ఓట్లు లభించాయి. అంటే సరైన నాయకత్వం, ప్రచార వ్యూహం లేకుండా పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కి ఆంధ్రప్రదేశ్ లో బిజేపి కంటే దాదాపు లక్షా 5 వేల ఓట్లు అధికంగా వచ్చాయి. దీన్ని బట్టి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం పూర్తిగా నసించలేదు అన్న విషయం అవగతం అవుతున్నది.

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే రానున్న ఎన్నికలలో సంప్రదాయ ఓట్లలో కొంతమేర అయినా ప్రోది చేసుకోవచ్చు అని ఆ పార్టీ నాయకత్వం తలపోస్తున్నది. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళితే ఇప్పటికిప్పుడు సీట్లు గెలుచుకోలేక పోయినా, ఓటింగ్ శాతం ను గణనీయంగా పెంచుకొని సుస్థిర పరచుకోవచ్చనేది కాంగ్రెస్ నాయకుల ఆలోచనగా వున్నది.

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి స్వీయ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ఖచ్చితంగా విజయావకాశాలు వున్న నియోజకవర్గాలు, హోరాహోరీ పోటీ జరిగే సెగ్మెంట్ లు, బలహీనంగా వున్న స్థానాలను గుర్తించి వేర్వేరు వ్యూహాలను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ లోనూ రేవంత్ తరహా ‘ ఫార్ములా ‘ ను అవలంబించాలని యోచిస్తున్నారు. 2019 ఎన్నికలలో 1.17 శాతం గా వున్న ఓటింగ్ ను వచ్చే ఎన్నికల నాటికి కనీసం 8 నుంచి 10 శాతం కు తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు ప్రారంభించినట్టు చెబుతున్నారు. అయితే వారి ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతం అవుతాయో వేచి చూడాలి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments