Saturday, August 13, 2022
spot_img
HomeEditorialఆధ్యాత్మికవేత్తలపై రాజకీయ క్రీనీడలు

ఆధ్యాత్మికవేత్తలపై రాజకీయ క్రీనీడలు

చికొటి ఉదంతం లో చినజీయర్ స్వామిపై వివాదాలు .... భక్తుల విశ్వాసానికి విఘాతం

శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి …. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆరాధ్యులు. సామాన్యుని నుంచి అసామాన్యుని వరకు చినజీయర్ స్వామి కి భక్తులుగా వుండటం నేడు చూస్తున్నాం. ఎవరి నమ్మకాలు వారివి. ఒకరి నమ్మకాన్ని తప్పుబట్టే హక్కు ఎవరికీ వుండదు. అదేవిధంగా కోట్లాదిమంది భక్తుల నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత స్వామీజీ కి సైతం వుంటుంది.

ఈ నేపథ్యంలోనే చినజీయర్ స్వామి పైన గత కొంత కాలంగా వివాదాలు ముసురుకుంటున్నాయి. రాజకీయాలు, కులమతాలు, రాగ ద్వేషాలకు అతీతంగా వుండాల్సిన స్వామీజీ లపై అసలు వివాదాలు ఎందుకు వస్తున్నాయి? ఒక్క చినజీయర్ స్వామి పైనే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది స్వామీజీల కు ఈ విధమైన పరిస్తితి ఎదురయింది. అందుకు వారి వ్యవహార శైలే కారణమని చెప్పక తప్పదు. రాజకీయవేత్తలతో సాన్నిహిత్యం చినజీయర్ స్వామి వంటి ఆధ్యాత్మిక వేత్తల ఔన్నత్యాన్ని మసకబారుస్తున్నది. ఇప్పుడు అదే క్రమంలో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోన్న చికోటి ప్రవీణ్ ఉదంతంలో చినజీయర్ స్వామి పేరు మరో మారు వివాదాల తెరమీదకు వచ్చింది. చినజీయర్ స్వామి కి వున్న కోట్లాది భక్తులలో చికొటి ప్రవీణ్ సైతం ఒకరు కావచ్చు. అంతమాత్రం చేత తన భక్తులు చేసే వ్యాపారాలపై స్వామీజీ కి అవగాహన వుంటుందని భావించనక్కర్లేదు. అయితే వారిరువురూ కలసి కారులో కలసి చక్కర్లు కొడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. అంతర్జాతీయంగా క్యాసినో లు నిర్వహించే వ్యక్తితో చినజీయర్ స్వామి కలసి పయనించడం పట్ల ఆయన భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం పై చినజీయర్ స్వామి ఇంతవరకు నోరువిప్పలేదు. వాస్తవానికి ఇది చాలా చిన్న సంఘటన. అయితే చికొటి ప్రవీణ్ అంతర్జాతీయ లావాదేవీలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నపుడు చినజీయర్ స్వామి ఉదంతం తెరమీదకు వచ్చింది. దీనిని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తెరమీదకు తెచ్చారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై చినజీయర్ స్వామి స్పందించని పక్షంలో ఆయనపై భక్తులు వుంచిన విశ్వాసానికి విఘాతం కలిగే ప్రమాదముంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, చినజీయర్ స్వామి పట్ల భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవారు. చినజీయర్ స్వామి సలహాతోనే యాదగిరిగుట్ట దేవాలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మాణం చేశారు. అనంతరం ముచ్చింతల్ లో ప్రపంచంలోనే అతిపెద్ద సమతామూర్తి విగ్రహాన్ని నెలకొల్పారు. అప్పటి నుంచి కేసీఆర్, చినజీయర్ స్వామి ల మధ్య అంతరం ఏర్పడింది. ఈ నేపధ్యం లోనే తెలంగాణ లో చికోటీ ప్రవీణ్ ఉదంతం తెరమీదకు వచ్చింది. సహజంగానే దీనికి రాజకీయ రంగు పులుముకొని ఆ వివాదంలోకి చినజీయర్ స్వామిని సైతం లాగే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది.

ఈ ఉదంతాన్ని పక్కన బెడితే చినజీయర్ స్వామి వ్యవహార శైలి సైతం కొంత భిన్నంగా నే వుంటుంది. తిరుమలలో వేయికాళ్ళ మండపాన్ని కూల్చిన సమయంలో చినజీయర్ స్వామి దానిని తీవ్రంగా తప్పుబట్టారు. అదే తిరుమలపై ప్రస్తుతం పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిపై చినజీయర్ స్వామి నోరు మెదపక పోవటాన్ని ఏవిధంగా పరిగణించాలి? అదేవిధంగా కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధించే సమ్మక్క, సారక్క ల విషయంలో చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు వారందరి మనోభావాలను గాయపరచాయి. మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం సైతం రాష్ట్ర పండుగగా గుర్తించింది. దానిపై వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామి తిరుమల విషయం లోనూ, ఇతర ప్రాంతాల్లో హిందూ ధర్మానికి జరుగుతున్న అపచారాల ఆరోపణల పైనా ఎందుకు స్పందించటం లేదన్న సందేహాలు తలెత్తుతున్నాయి. దీనివల్ల చిన్న జీయర్ స్వామి కేవలం ఎంపిక చేసుకున్న కొన్ని అంశాలపైనే స్పందిస్తారన్న భావనకు ఆస్కారం ఏర్పడుతుంది. ప్రస్తుత పరిణామాలు పై చినజీయర్ స్వామి స్పందించి భక్తులలో నెలకొని వున్న సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా వున్నది. సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలపై చినజీయర్ స్వామి వంటి స్థాయి గలిగిన వారు స్పందించక పోయినా ఎవరూ పట్టించుకోరు. అయితే ఇప్పటికే పలు వివాదాలు ఎదుర్కొంటున్న చినజీయర్ స్వామి పై తాజా పరిణామాల పై స్పందించాల్సిన బాధ్యత ఎంతైనా వున్నది. మానవులు అనుసరించాల్సిన ధర్మం అనేది ఎక్కడైనా ఒకేరకంగా వుంటుంది. అది ప్రాంతాన్ని, మతాన్ని, కులాన్ని, రాజకీయాలను బట్టి మారదు. ఈ సత్యాన్ని సామాన్యులకు అర్థం అయ్యే విధంగా బోధించి, అనుసరించాల్సిన బాధ్యత కేవలం ఒక్క చినజీయర్ స్వామి పైనే కాదు ఆధ్యాత్మిక వేత్తలు అందరి పైనా వున్నది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments