కాంగ్రెస్ లోకి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే..? షాక్ లో కిషన్ రెడ్డి..?
తెలంగాణాలో గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లతో అధికారాన్ని సొంతం చేసుకుంది. ఐతే 8 స్థానాలకే పరిమితమైన బాజాపా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే టార్గెట్ గా సత్తా చాటాలని భావిస్తోంది. రాష్టంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన నేతలు అధికార కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇటీవలే కారు పార్టీకి చెందిన ఓ ఎంపీ, జడ్పీ ఛైర్ పర్సన్, పలువురు కీలక నేతలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి హస్తం గూటికి చేరారు. వీరి బాటలోనే మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుండగా.. నెక్స్ట్ ఎవరనేది ఆసక్తి రేపుతోంది. ఐతే రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి, మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు రాష్ట్రం నుంచి డబుల్ డిజిట్ సభ్యులను పార్లమెంట్‌కు పంపాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న క్రమంలో, తెలంగాణాలో బీజేపీకి ఊహించని బిగ్ షాక్ తగిలింది.
బుధవారం నాడు బీజేపీకి చెందిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావటం రాష్ట్ర రాజకీయాల్లో, బీజేపీ పార్టీలో కలకలం రేపటంతో పాటు చర్చనీయాంశమైంది. మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి దంపతులు సైతం బుధవారం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో వీరు త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరడంలో భాగంగానే సీఎంతో భేటీ అయ్యారా..? అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐతే బీజేపీ విజయ సంకల్ప యాత్రను చేపట్టినప్పటికీ గత కొంత కాలంగా సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు బీజేపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్ప యాత్రలోనూ ఆయన పాల్గొనలేదు. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే టాక్ నడుస్తోంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన సన్నిహితులు ఖండిస్తున్నారు.
నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించేందుకే హరీష్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు చెబుతున్నారు. కానీ దీని పై బీజేపీ ఎమ్మెల్యే ఇప్పటికి స్పందించలేదు, కాంగ్రెస్ లో చేరిక పై అధికారిక ప్రకటన కూడా చేయలేదు. బీజేపీకి ఎఫెక్ట్ గా ఇంత జరుగుతున్నా బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు మాత్రం పార్టీ మార్పు పై సీఎం రేవంత్ తో భేటీ పై ఇప్పటి వరకు స్పందించకపోవటం గమనార్హం. మరి ఇప్పటికే కాంగ్రెస్ బలం పెరుగుతుంటే ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే హరీష్ బాబు కూడా హస్తం గూటికి చేరితే బీజేపీకి కోలుకోలేని దెబ్బ పడినట్లే అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.