తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్ దూకుడుకి, గులాబీ పార్టీ నాయకత్వం ఓటమి నుండి కోలుకోక ముందే వరుస దెబ్బలతో సతమతమవుతుంటే. ఇప్పుడు తాజాగా లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి ఊహించని మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే మాజీ మేయర్ బొంతు దంపతులు, పట్నం దంపతులు, కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోగా, ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్లు నలుగురు కాంగ్రెస్‌లో చేరారు. 2 వ వార్డు కౌన్సిలర్ సుందర్ సింగ్, 6వ వార్డు కౌన్సిలర్ దేమే యాదగిరి, 9 వ వార్డు కౌన్సిలర్ దేవుని జయ రాజు, 11 వ వార్డు కౌన్సిలర్ చిలుక గంగాధర్ బుధవారం బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు వీరికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు మైనంపల్లి.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పాలనకు ఆకర్షితులైన చేగుంట మండలం రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్, మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మేకల పరమేశ్ వీరి బాటలోనే బుధవారం బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపుకోసం కష్టపడి పనిచేశామన్నారు. కాగా సొసైటీ చైర్మన్ అయిన తనను ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదన్నారు. ఇటీవల రామాయపల్లి గెస్ట్ హౌస్ లో జరిగిన చేగుంట మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంతో పాటు, మండల పార్టీ అధ్యక్ష ఎన్నిక గురించి తనకు సమాచారం ఇవ్వలేదన్నారు.
దీంతో మనస్తాపం చెందిన ఆయన బారాసా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు పరమేశ్ దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డికి పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. మొత్తానికి హరీష్ రావు అడ్డాగా పేరున్న మెదక్ లో బారాసా నుండి కాంగ్రెస్ లోకి చేరికలు చూస్తుంటే హరీష్ రావు గడ్డ కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ అడ్డాగా మారే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.