అసెంబ్లీ ఎన్నికల్లో.. బెడిసికొట్టిన ఈటెల ప్లాన్
హుజూరాబాద్ నుంచి.. మల్కాజ్ గిరికి మకాం మార్చిన ఈటెల
కాంగ్రెస్ వైపు చూస్తున్న.. ఈటెల అనుచరులు
ఈటెల పై సీఎం రేవంత్.. ఆసక్తికర కామెంట్స్ అందుకేనా
హుజురాబాద్ గడ్డ.. కాంగ్రెస్ అడ్డాగా మారనుందా
తెలంగాణకు పరిచయం అక్కర లేని పేరు ఈటల రాజేందర్. 1964 మార్చి 20న ప్రస్తుత హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోలో జన్మించారు.
ఆయనకు తల్లిదండ్రులు జన్మనిస్తే.. రాజకీయ జన్మనిచ్చింది మాత్రం హుజూరాబాద్ అనే చెప్పాలి. 2001లో ప్రారంభించిన తెరాస వ్వవస్థాపకుల్లో ఒకరు ఈటల రాజేందర్ ,2004 నుంచి, 2021 వరకు హుజూరాబాద్ ప్రజలు వరుసగా ఆయననే గెలిపిస్తూ వచ్చారు.ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన అక్కడి ప్రజలు.. 2023 ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు హుజూరాబాద్ ఓటర్లు. అప్పటి నుంచి ఆయన తీరు హుజూరాబాద్‌తో అంటి ముట్టనట్టుగా ఉందట.హుజూరాబాద్‌లో ఈటల కు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. వరుస విజయాలతో తనకు ఎదురే లేదని భావించిన తరుణంలో అనూహ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి పై ఈటెల ఓడిపోయారు.
దీనిని ఈటల అనుచరులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోవడం లేదు. ఓటమి తర్వాత ఈటల హుజూరాబాద్‌వైపు కన్నెత్తి చూడడంలేదు. దీంతో ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఈటల అనుచరులకు పార్టీతో సంబంధం ఉండదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పనిచేస్తారు. ఇలా 20 ఏళ్లుగా హుజూరాబాద్‌లో తనకంటూ ఒక కోటని ఏర్పాటు చేసుకున్నారు. కమలాపూర్, జమ్మికుంటలో ఆయనకు ప్రత్యేక అనుచరగణం ఉంది.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌పై కసి తీర్చుకోవాలని భావించి. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేశారు. కానీ, రెండు పడవలపై ప్రయాణం బెడిసి కొట్టింది.రెండు చోట్ల పోటీ చేసి, రెండింటిలో ఓడిపోయారు. దీంతో బీజేపీ ఈసారి ఆయనకు మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ప్రకటించింది. ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. హుజూరాబాద్‌కు దూరం అవుతున్నందుకు స్థానికులు బాధపడుతున్నారు.ఇక ఈటల మల్కాజ్‌గిరి వెళ్లే క్రమంలో హుజూరాబాద్‌లో కూడా తన మార్కు పోకుండా ఉండేందుకు ఈటల మరో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ తన భార్య జమునను ఇన్‌చార్జిగా నియమించే ఆలోచన చేస్తున‍్నట్లు సమాచారం . ఇదిలా ఉండగా ఈటల హుజూరాబాద్‌ను వీడితే ఆయన అనుచరులను తమవైపు తిప్పుకునేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ మంది హస్తం వైపే చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే జరుగుతే రానున్న ఎన్నికల్లో హుజురాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డాగా మారటం పక్కా అని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తుంది. ఆదివారం మేడ్చల్‌లో నిర్వహించిన ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్.. మాజీ మంత్రి ఈటలను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. ఈటల రాజేందర్ ఏ ముఖం పెట్టుకుని మల్కాజ్‌గిరి ప్రజలను ఓట్లు అడుగుతాడంటూ సీఎం రేవంత్ ఆ సభలో సీరియస్ కామెంట్స్ చేశారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.