Saturday, August 13, 2022
spot_img
HomeEditorialతాయిలాల పంపిణీయే విజయ సోపానమా?

తాయిలాల పంపిణీయే విజయ సోపానమా?

తాయిలాలు పంపిణీ పై ఆందోళన వ్యక్తం చేసిన ' సుప్రీం ' ....... దేనిని తాయిలం గా పరిగణించాలి?

ఎన్నికలలో తాయిలాలు పంచటం రాజకీయ పార్టీ లకు అనివార్యంగా మారుతున్నది. ప్రతి ఎన్నికలోనో ఒకరిని మించి మరొకరు పోటీలు పడి తాయిలాలు పంపిణీ కి శ్రీకారం చుడుతున్నారు. దీంతో వాటికి హద్దే లేకుండా పోతుంది. ఎన్నికలలో తాయిలాలు పంపిణీ పై అత్యున్నత న్యాయస్థానం సైతం ఇటీవలనే కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగింది. వీటిపై అన్నీ రాజకీయ పార్టీలకు లోలోన ఆందోళన వున్నప్పటికీ వాటి పై హామీలు ఇవ్వటం, పంపిణీ చేయటం వంటివి చేయకుండా మిన్నకుండలేని పరిస్తితి. రానురాను వెర్రితలలు వేస్తున్న ఈ తాయిలాలు సంస్కృతి కి అడ్డుకట్ట వేసే విషయంలో ఎన్నికల కమిషన్ చేతులెత్తేసింది. అది తమ అధికార పరిధిలోకి రాదని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది.


అయితే ఎన్నికలలో ఓటర్ల ను ప్రలోభ పెట్టడానికి వాస్తు, లేదా నగదు రూపంలో అందజేయటం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇది నిస్సందేహంగా మారాం చేసే పిల్లలను బుజ్జగించి దారికి తెచ్చుకోవటానికి ఇచ్చే ‘ తాయిలం ‘ వంటిదే. ఈ తరహా తాయిలాలు పట్ల అత్యున్నత న్యాయస్థానం సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా వున్నది.

ఎన్నికలలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు సంపద సృష్టికి, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుదలకు, ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించేందుకు ఉపకరించేవిగా వుండాలి. ఆ విధంగా కాకుండా స్వల్పకాలిక లబ్ది కోసం ఓటర్లకు తాయిలాలు రూపంలో వేసే ‘ ఎర ‘ సమాజ అభివృద్ధికి లేదా వ్యక్తిగత ఉన్నతి కి ఏమాత్రం దోహదకారి కాదు. రాజకీయ పార్టీలు అన్నీ దీనిని తమ బాధ్యత గా గుర్తెరగాలి. జాతీయ పార్టీల తో పోల్చుకుంటే ఈ తాయిలాలు సంస్కృతి ప్రాంతీయ పార్టీల లోనే ఎక్కువగా వున్నట్టు అవగతం అవుతున్నది. అందులోనూ కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో తాయిలాలు సంస్కృతి వెర్రితలలు వేస్తోంది. ఆ విషయంలో తమిళనాడు రాష్ట్రం అన్నింటికన్నా ముందువరుసలో వున్నట్టు చెప్పవచ్చు. తాయిలాలు తో ఓటర్ల ను ప్రలోభ పెట్టీ అధికారంలోకి వచ్చిన పాలకులు ప్రజాసంక్షేమాన్ని పట్టించుకుంటారు అన్న గ్యారంటీ లేదు. ప్రజలు తనను ఎన్నుకొలేదని, తానే అధికారాన్ని కొనుగోలు చేశామన్న భ్రమలో పాలకులు వుంటారు. తాయిలం కోసం చేయిచాపిన లేదా ప్రలోభానికి గురి అయిన ఓటరు, రాజకీయ పార్టీలు చేసే మోసపూరిత వాగ్దానాలు గూర్చి ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాడు. వీటన్నింటినీ దృష్టిలో వుంచుకొని దేశ అత్యున్నత న్యాయస్థానం వెలిబుచ్చిన ఆందోళన ను పరిగణలోకి తీసుకొని ‘ తాయిలాలు ‘ పంపిణీ పై రాజకీయ పార్టీలు, పునరాలోచన చేయాలి. అదేసమయంలో తాయిలాలు కు ఆశపడి రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వల్పకాలిక లబ్దికోసం తాకట్టు పెట్టకుండా స్వేచ్చగా ఓటుహక్కు వినియోగించు కోవాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments