Saturday, August 13, 2022
spot_img
HomeEditorialఉచిత విద్యుత్ కొనసాగేనా?

ఉచిత విద్యుత్ కొనసాగేనా?

వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్ల బిగింపు తో సందేహాలు .... శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు

రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణ లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సంస్కరణ అమలు జరిపే సమయంలో కొన్ని అపోహలు తలెత్తే అవకాశం వుంటుంది. వాటిని అధిగమించి ముందడుగు వేస్తే ప్రభుత్వం ఆశించిన విధంగా సంస్కరణల ఫలాలు ప్రజలకు చేరువవుతాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లకు మీటర్లు బిగించే విషయంలో రాష్ట్రప్రభుత్వం కృతనిశ్చయంతో వున్నది. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించటం తో పాటు విద్యుత్ వృధాను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో తొలుత ఈ తరహా ప్రయత్నాన్ని శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు జరిపారు. ఈ ప్రయోగం శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా విజయవంతం అయింది. దీంతో ఆన్ని జిల్లాలలో ఈ విధానాన్ని ముమ్మరంగా అమలు జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

రాష్ట్రప్రభుత్వం ప్రస్తుతం వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ అందిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తొలిసారిగా ఈ పథకాన్ని అమలు జరిపారు. తమ స్వంత పార్టీ అధినాయకత్వం అభ్యంతరాలను సైతం ఖాతరు చేయకుండా డాక్టర్ వైఎస్ ఉచిత విద్యుత్ పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే సమర్థంగా అమలు జరిపారు. అప్పటి నుంచి ఈ పథకం ఉభయ తెలుగు రాష్ట్రాలలో నిరాఘాటంగా కొనసాగుతున్నది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లకు మీటర్లు బిగించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించడంతో ఉచిత విద్యుత్ కు కాలం చెల్లుతుందా? అని రైతులలో సందేహాలు తలెత్తాయి. దీనిపై రైతులలో నెలకొని వున్న అపోహలను తొలగించటం లో అధికార యంత్రాంగం విఫలం అవుతోంది.

వ్యవసాయ కనెక్షన్ లకు విద్యుత్ మీటర్లు అమర్చటం వల్ల రైతులపై ఏమాత్రం భారం పడే అవకాశం లేదు. ఇది సమర్థవంతంగా అమలు చేయగలిగితే రైతులకు ఎంతో ప్రయోజనకరం అవుతుందనటంలో సందేహం లేదు. రైతులు వినియోగించుకున్న విద్యుత్ కు చెల్లించాల్సిన నగదు మొత్తాన్ని ప్రభుత్వమే వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తుంది. దీనివల్ల రైతుకు సైతం తాను ఎంత విద్యుత్ వినియోగిస్తున్నది అవగాహన వృధా అరికట్టేందుకు ఆస్కారం వుంటుంది. అక్రమ కనెక్షన్ లను సైతం సులువుగా గుర్తించేందుకు వీలు కలుగుతుంది. విద్యుత్ పంపిణీ లో లోపాలు, ట్రాన్స్ఫార్మర్ లపై అదనపు లోడ్ పడకుండా ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి పరిశీలన జరిపింది. ఆ ఒక్క జిల్లాలోనే నెల రోజుల్లో 33.75 మిలియన్ యూనిట్ల ల విద్యుత్ ఆదా అయినట్టు ప్రభుత్వం గుర్తించింది. శ్రీకాకుళం మోడల్ ను ఆన్ని జిల్లాలలో అమలు జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

అక్రమ కనెక్షన్ లు నివారించే క్రమంలో భాగంగా వ్యవసాయ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు అందరికీ తక్షణమే మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. రైతులకు విద్యుత్ సేవలు అందించే క్రమంలో జాప్యం నివారించాలని ప్రభుత్వం సూచించింది. దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత వుండటంతో రాష్ట్రంలో నున్న డిస్కం లు విద్యుత్ ను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తున్నది. విద్యుత్ వినియోగానికి, ఉత్పత్తి కి మధ్య భారీ వ్యత్యాసం వుండటంతో కొరత ఏర్పడి, కొనుగోలు అనివార్యమయింది. మరో ఆరు నెలల పాటు ఇదే పరిస్తితి కొనసాగ వచ్చని అంచనా వేస్తున్నారు. విజయవాడ లోని థర్మల్ విద్యుత్ కేంద్రం 5 వ దశ తో పాటు కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాలు మరి కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఆ రెండు ఉత్పత్తి కేంద్రాలు అందుబాటులోకి వచ్చిన పక్షంలో దాదాపు 16 వందల మెగావాట్ ల విద్యుత్ ఉత్పాదన అందుబాటులోకి వస్తుంది.

దీనికి తోడు థర్మల్ కే దేశాలలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పాదన తగ్గి వ్యవసాయరంగానికి చాలినంత మేర విద్యుత్ ను అందించలేక పోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఏపి ఎం డి సి నిర్వహించే బొగ్గు గనులు లో ఉత్పాదన పెంపొందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పాదన అందుబాటులో కి వచ్చే లోగా వ్యవసాయ విద్యుత్ సరఫరాను మెరుగు పరచాలని ప్రభుత్వం భావిస్తోంది. మీటర్ల బిగింపు విషయంలో రైతులలో నెలకొని వున్న అపోహల తొలగింపుకు అధికారులు కృషి చేయాల్సి వుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments