తెలంగాణ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ సభ్యుల పదవుల్లో కాంగ్రెస్ పార్టీకి రెండు, బీఆర్‌ఎస్‌కు ఒక స్థానం ఖరారైన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ తరఫున వద్దిరాజు రవిచంద్ర అధికార కాంగ్రెస్ నుండి రేణుకా చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్ లు ఏకగ్రీవం అయ్యారు. దీంతో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి.. బుధవారం అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె బుధవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. రాజ్యసభకు తనను ఎంపిక చేసినందుకు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంకాగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది పదవి మాత్రమే కాదని, దీంతో బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నానన్నారు.
ఇదే క్రమంలో బారాసా నేత నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరితే గాంధీభవన్ లో కుర్చీ ఉంటుందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఆఫర్ ఇచ్చారు. గాంధీభవన్ లో చాలా కుర్చీలున్నాయన్న రేణుక సీటు విషయంలో మాత్రం కుదరదని చెప్పారు. ఖమ్మం ఎంపీ టికెట్ విషయంలో ఏఐసీసీ, ఎన్నికల కమిటీలు కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవాలని, ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఖమ్మంలో ఈసారి కాంగ్రెస్ విజయం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఖమ్మంలో చోటులేదని ఆమె తెలిపారు.
మరి నామా నాగేశ్వరరావు పై రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు బిఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ పెడుతున్నాయ్. రాష్టంలో కాంగ్రెస్ అధికారంలో రావటంతో పాటు ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డాగా మారటంతో నామా నాగేశ్వరరావు హస్తం వైపు చూస్తున్నారా అందుకే రేణుక చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారా అన్న ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. మరి దీని పై నామా నాగేశ్వరరావు ఇప్పటికి స్పందించలేదు. లోక్ సభ ఎన్నికల ముందు
కెసిఆర్ కు గుడ్ బై చెప్పి నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా. కెసిఆర్ తోనే కలిసి ప్రయాణిస్తారా అనేది త్వరలోనే తేలిపోనున్నట్లు ప్రచారం జరుగుతుంది.