పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో రాజకీయాలు మరింత హీటెక్కిపోతున్నాయి. వివిధ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్దాలకు దిగుతున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలు, పంచ్ డైలాగులతో రాష్ట్రం మొత్తం హోరెత్తిపోతుంది. ఇప్పుడు రాష్టంలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందా.. లేదంటే ఆ ఇద్దరి మద్యే వార్ నడుస్తుందా ఆసక్తిరేపుతోంది. గత కొంతకాలం నుండి కెసిఆర్ ఇంటికే పరిమితమవ్వటంతో, సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు & కేటీఆర్ గా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే పలు సందర్భాల్లో మాజీ సీఎం కేసీఆర్ పై నూతన సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే.. కెసిఆర్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా సైలెంట్ అయ్యారు.
మామ కెసిఆర్ కోసం తామేమి తగ్గేది లే అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పై అల్లుడు హరీష్ రావు ఆదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు కానీ… అవి పెద్దగా ప్రజల్లోకి ఎక్కటం లేదు. గతంలో తన నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి చెల్లనిపైసా అంటూ కేసీఆర్, కేటీఆర్ ఇతర నేతలు విమర్శలు చేశారు.. ఐనా కామారెడ్డిలో కేసీఆర్ ఓటమికి రేవంత్ రెడ్డి కారణమయ్యాడు. ఆ దెబ్బతో ఇప్పటికీ ఇంటికే పరిమితమయ్యాడు కారు పార్టీ ఓనర్ కెసిఆర్ సాబ్. అప్పటి నుండి కెసిఆర్ గొంతు మూగబోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సందర్భంలో కూడా అధికార కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తోంది బీఆర్‌ఎస్.
అదే విధంగా కాంగ్రెస్ కూడా బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తోంది. అటు సీఎం రేవంత్‌రెడ్డి, ఇటు హరీష్ ల మధ్య మాటల యుద్ధాలు, పంచ్ డైలాగులతో దద్దరిల్లిపోతుంది. ఇక లోక్ సభ ఎన్నికల్లో బారాసా ఓడితే కారు పార్టీ కనుమరుగవ్వటం ఖాయమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక పై ఫోకస్ పెట్టింది. బిఆర్ఎస్ లో మాత్రం పోటీ చేయాలంటే సిట్టింగులే వెనకడుగేస్తున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ని కెసిఆర్ ఎదుర్కోగలడా అనేది చర్చనీయాంశమైంది.