తెలంగాణలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా ఐతే విజయం సాధించిందో… అదే తరహాలో లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగనుందా? అంటే అవుననే సమాధానం పలు సర్వేలు చెప్తున్నాయి. తెలంగాణాలో 17 పార్లమెంట్ స్థానాలుండగా ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకుంటుందో తాజాగా తెలంగాణలో పీపుల్స్‌పల్స్ – సౌత్‌ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ట్రాకర్ పోల్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 8 నుంచి పది పార్లమెంటరీ స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటుతుందని ఈ సర్వే వెల్లడించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై ఇక ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో 3 నుంచి 5 స్థానాలు దక్కుతాయని, అదే విదంగా బీజేపీ పార్టీకి 2 నుంచి 4 పార్లమెంట్ సీట్లు దక్కే అవకాశం ఉందని పీపుల్స్‌పల్స్ – సౌత్‌ఫస్ట్ తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి 40 శాతం, బీఆర్ఎస్కు 31 శాతం, బీజేపీకి 23 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే వెల్లడించింది
అయితే.. గతేడాదితో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌పార్టీ 1 శాతం ఓట్లు, బీజేపీ 9 శాతం ఓట్లు అధికంగా పొందుతుండగా.. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం 6 శాతం ఓట్లు కోల్పోతోందని పీపుల్స్‌పల్స్ – సౌత్‌ఫస్ట్ ట్రాకర్ పోల్ అంచనా వేసింది. ఇక.. కాంగ్రెస్ పార్టీకి మహిళల్లో ఎక్కువ మద్దతు ఉన్నట్లు పీపుల్స్‌పల్స్ – సౌత్‌ఫస్ట్ సర్వే పేర్కొంది. అధికారంలోకి వచ్చాక మహిళలకు మహాలక్ష్మి స్కీం ద్వారా ఉచిత ప్రయాణం అందిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో.. మహిళల ఓట్లు హస్తానికి ఎక్కువ పడొచ్చనే ధీమా ఆ సర్వే వెల్లడించింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలపై ఫిబ్రవరి 11 నుండి ఫిబ్రవరి 17 వరకు ట్రాకర్ పోల్ సర్వేను నిర్వహించింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ట్రాకర్ పోల్ సర్వే కోసం.. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో, 4,600 శాంపిల్స్ సేకరించిన ఆధారంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో తేల్చేసిందని సమాచారం.