తెలంగాణాలో బారాసా ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ గులాబీ అధినేత కెసిఆర్ సారుకి ఊహకందని రీతిలో మారుతున్నాయి. జిల్లాలో బీఆర్‌ఎస్ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టేందుకు పీసీసీ చీఫ్. సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే గాంధీభవన్‌లో రేవంత్ సమక్షంలో వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీత రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఐతే రాష్టంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బారాసా బాజాపా పార్టల కంటే.. మెజార్టీ సీట్లు గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం పావులు కదుపుతోంది. కీలకమైన చేవెళ్ల స్థానం నుంచి బలమైన అభ్యర్థిని దింపాలని కసరత్తు చేస్తోంది. అందుకు తగ్గట్టే మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సతీమణికి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఐతే ఇదే క్రమంలో చేవెళ్ల చెల్లమ్మ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా.. కాంగ్రెస్ పాలనకు ముగ్ధులై కారు పార్టీకి, సబితా ఇంద్రారెడ్డికి గుడ్ బై చెప్పి మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్ నరేంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు మాజీ శాసనసభ్యులు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి. వీరితో పాటు మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ భారాసా కార్పోరేటర్ జిల్లెల అరుణ, మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ 30వ డివిజన్ భారాసా కార్పోరేటర్ ప్రమీల యాదగిరి ముదిరాజ్ వారి అనుచరులతో కలిసి కేఎల్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ గులాబీ నేతలకు మాజీ ఎమ్మెల్యేలు కేఎల్ఆర్ మరియు తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వీరంతా కాంగ్రెస్ గూటికి చేరటంతో సబితా ఇంద్ర రెడ్డికి ఊహించని బిగ్ షాక్ తగిలినట్లయింది. లోక్ సభ ఎన్నికల తర్వాత చేవెళ్లలో కూడా కర్రు పార్టీ కనుమరుగవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.