గత పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా.. కెసిఆర్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నపుడు కూడా పార్టీకి అండగా నిలిచిన నేతల్లో ఒకరుగా సిరిసిల్ల రాజయ్య పేరు వినిపిస్తుంటుంది. ఐతే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో రాష్టంలో కాంగ్రెస్ అధికారాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఎంతోమందికి వారి హోదాకు తగ్గట్టు కాంగ్రెస్ లో కీలక పదవులు దక్కాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామకమయ్యారు. చైర్మన్‌తో పాటు సభ్యులుగా ఎం రమేశ్, సంకేపల్లి సుదీర్‌రెడ్డి, నెహ్రూనాయక్ మాలోత్‌ను నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్ చైర్మన్‌తో పాటు సభ్యులు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
ఆదివారం హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫీసులో చైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్, సభ్యులకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ..
గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు గత సర్కారు నిధులివ్వకుండా నిర్వీర్యం చేసిందన్నారు. గత పదేండ్లు స్థానిక సంస్థలు నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డాయని చెప్పారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. ఈ పదవి అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి సిరిసిల్ల రాజయ్య 15వ లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.