వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగింది. వీఐపీ లాంజ్ లో విశ్రాంతి తీసుకుంటున్న జగన్ పై వెయిటర్ శ్రీనివాసరావు కత్తితో దాడి పాల్పడ్డాడు. ఈ ఘటనలో జగన్ ఎడమ భుజానికి స్వల్ప గాయమయ్యింది. విమానాశ్రయ భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి… అక్రమాస్తుల కేసులో శుక్రవారం నాంపల్లిలోని న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉంది. దీంతో హైదరాబాద్ వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం జగన్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం బయలుదేరెందుకు సమయం ఉన్నందున వీఐపీ లాంజ్ లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో జగన్ వద్దకు వచ్చిన వెయిటర్ శ్రీనివాసరావు జగన్ తో మాట్లాడుతూనే చిన్న కత్తితో జగన్ పై దాడి చేశాడు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి ఎడమ భుజానికి గాయమైంది. వైద్యులు ఆయనకు అక్కడే ప్రాథమిక చికిత్సను అందించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయంలోకి ప్రవేశించే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. లోపలకు ఎవరినీ రాకుండా అడ్డుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిపై దాడి సమాచారం తెలుసుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. స్థానిక ఏసీపీ హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకుని సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here