విశాఖలో బయలుదేరి మూడున్నర ఏళ్ల తర్వాత గమ్యస్థానం చేరిన గూడ్స్ రైలు

కొన్ని సంఘటనలు చిత్ర విచిత్రంగా అనిపిస్తాయి.. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విశాఖప‌ట్ట‌ణం న‌గ‌రం నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బ‌స్తి జిల్లాకు ఎరువుల లోడ్ తీసుకువెళుతూ గ‌ల్లంతైన ఒక గూడ్సు రైలు వాగ‌న్ మూడున్న‌ర సంవ‌త్స‌రాల త‌ర‌వాత త‌న గ‌మ్యస్ధానానికి చేరుకున్న విచిత్ర సంఘ‌ట‌న ఇటీవ‌ల జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే… ఇండియ‌న్ పొటాష్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ త‌మ ఉత్ప‌త్తుల‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బ‌స్తి జిల్లాలో ఒక షాపుకు పంపించ‌డానికి 2014 న‌వంబ‌రులో గూడ్సురైలులో ఒక వాగ‌న్ ను బుక్ చేసింది. కాని ఆ వాగ‌న్ దారిలో ఎక్క‌డో గ‌ల్లంతైంది.

త‌ను పంపిన స‌రుకు కొనుగోలుదారుకు చేరుకోక‌పోవ‌డంతో పొటాష్ కంపెనీ యాజ‌మాన్యం రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేర‌కు రైల్వే అధికారులు వాగ‌న్ కోసం ఎంత‌గా వెదికినా ఎక్క‌డా దొర‌క‌లేదు. నెల‌ల త‌ర‌బ‌డి అది ఒక స్టేష‌న్ నుంచి మ‌రో స్టేష‌న్ కు తిరుగుతూనే వున్నా అధికారులు ఆ విష‌యాన్ని క‌నిపెట్ట‌లేక‌పోయారు. చివ‌రికి ఇప్పుడు దాదాపు మూడున్న‌రేళ్ల త‌ర‌వాత దానంత‌ట‌దే బ‌స్తి జిల్లాలోని రైల్వే స్టేష‌నుకు చేరుకుంది.
కాని అప్ప‌టికే దాంట్లో వున్న దాదాపు 10 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన ఉత్ప‌త్తులు చెడిపోవ‌డంతో వాటిని డెలివ‌రీ తీసుకోవ‌డానికి షాపు య‌జ‌మాని రామ‌చంద్ర గుప్త నిరాక‌రించాడు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడో మూడున్న‌రేళ్ల క్రితం రావాల్సిన పార్సిల్ ఇప్పుడు వ‌చ్చింద‌ని, ఈ జాప్యం కార‌ణంగా స‌రుకు అంతా చెడిపోయింద‌ని చెప్పాడు. దీనికి త‌గిన న‌ష్ట‌ప‌రిహారాన్ని రైల్వే శాఖ నుంచి వ‌సూలు చేస్తామ‌ని అన్నాడు.
గ‌ల్లంతైన ఈ గూడ్సు వాగ‌న్ గురించి ఈశాన్య రైల్వేకు చెందిన అదికారి సంజ‌య్ యాద‌వ్ వివ‌ర‌ణ ఇచ్చారు. సాధార‌ణంగా ఏదేని వాగ‌న్ లో వున్న స‌రుకు చెడిపోయినా, ప్ర‌మాద‌క‌రంగా వున్నా ఆ వాగ‌న్ ను ప‌క్క‌కు తీసి యార్డులో వుంచుతార‌ని తెలిపారు. ఆ విధంగానే ఈ వాగ‌న్ ను ఉత్తర రైల్వేకు చెందిన ఒక స్టేష‌న్ లో పార్కు చేసి వుంచార‌ని, ఈశాన్య రైల్వే అధికారులు దీని కోసం వెద‌క‌డం ప్రారంభించిన‌ప్పుడు ఆ విష‌యం తెలిసింంద‌ని చెప్పారు. ఈ వాగ‌న్ లోని స‌రుకును తీసుకోవ‌డానికి ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ రాలేద‌ని, ఈ స‌రుకును ఎవ‌రి కోసం వ‌చ్చిందో గుర్తించిన త‌ర‌వాత వారికి డెలివ‌రీ ఇస్తామ‌ని ఆ అధికారి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here