బూందీగా మొదలై తిరుపతి లడ్డూగా మారి 78 ఏళ్లు…

లడ్డు పేరు చేబితే వేంటనే టక్కున గుర్తోచ్చేది మన తిరుపతి లడ్డు.సామాన్యుల నుండి కోట్లకు పడగలేత్తిన భాగ్యవంతుడి వరకూ ఎంతో భక్తిభావంతో ఆరగించి తినేది తిరుపతి లడ్డు. ఎవరు తిరుపతి శ్రీవారి దర్శనానికి పయణం అయినా మనం వెంటనే లడ్డు తీసుకుని రావడం మరచిపోకండి.. అని చెప్పేస్తాం..

తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది. అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే ఈ లడ్డుకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు అని అర్ధం. భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం. తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ళ వరకూ ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం వడకు ఉండేది. అప్పట్లో శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి.
1803లో బూందీగా పరిచయమై, 1940లో లడ్డూగా స్థిరపడింది. శ్రీవారి లడ్డూకు మేథో సంపత్తి హక్కులు ఉన్నాయి. ఇక ఏటా లడ్డు తయారీ చేసే సరుకుల కోసం రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది టిటిడి బోర్డు. శ్రీవారి లడ్డూ మాధుర్యం 1940లో పరిచయమై 2017 నాటికి 77 ఏళ్లు పూర్తిచేసుకుంది. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతుంది.
సుఖీయం (క్రీ.శ.1445), అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం(క్రీ.శ.1468), మనోహర పడి(క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసేరోజుల్లో 1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో ప్రసాదాలు విక్రయించడంలో భాగంగా బూందీ తీపి ప్రసాదంగా ప్రవేశ పెట్టారు. 1940ల నాటికి అదే లడ్డూగా మారింది. క్రమేపీ వడ స్థానాన్ని లడ్డు సంపాదించుకుంది, ఇప్పుడు లడ్డుకు డిమాండ్ ఎంతో ఉంది.

లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును ‘దిట్టం’ అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ ధర్మకర్తలమండలి 1950లో నిర్ణయించింది. అవసరాలతో పాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు.
ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీని ప్రకారం 5,100 లడ్డూల తయారీకోసం ఆవు నెయ్యి 165 కేజీలు, శెనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, జీడిపప్పు 30 కేజీలు, ఎండు ద్రాక్ష 16 కేజీలు, కలకండ 8 కేజీలు, యాలకలు 4 కిలోలు.. మొత్తంగా 803 కేజీల సరుకులు వినియోగిస్తారు.
1940 తొలి రోజుల్లో కొండ లడ్డూ (అప్పట్లో కల్యాణోత్సవం లడ్డూ సైజులో ఉండేది) రేటు ఎనిమిదణాలే. ఆ తర్వాత రూ.రెండు, రూ.ఐదు, రూ.10, రూ.15, ప్రస్తుతం రూ.25 కు చేరింది.

ప్రస్తుతం రోజూ నాలుగు లక్షలకు పైగా లడ్డూలు తయారు చేస్తూ భక్తులకు అందజేస్తోంది. అయినా డిమాండ్ రెట్టింపు స్థాయిలోఉండటం గమనార్హం.

ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, అతిథులకోసం ఆస్థానం లడ్డూ (750 గ్రాములు), కల్యాణోత్సవం గృహస్తుల కోసం కల్యాణోత్సవం లడ్డూ (ధర రూ.100), భక్తులకు ఇచ్చే సాధారణ ప్రోక్తం లడ్డూ (175 గ్రాములు, ధర రూ.25) తయారు చేస్తారు. ప్రోక్తం లడ్డూకు రూ.100 ధర చెల్లించినా దొరకని సందర్భాలు ఉన్నాయంటే తిరుమల లడ్డూ కి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. దిట్టాన్ని టీటీడీ పక్కాగా అమలు చేయడం, లడ్డూ తయారు చేసే పద్ధతుల్లో శాస్త్రీయతల వల్లే తిరుమల లడ్డూ రుచి ఏమాత్రం తగ్గడంలేదు.
తిరుమలేశుని లడ్డూ, ప్రసాదాల తయారీకి అవసరమైన 16 వేల మెట్రిక్ టన్నుల ముడి పదార్థాల కొనుగోలు కోసం టీటీడీ ఏటా రూ.200 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేస్తోంది. ఇందులో శ్రీవారి లడ్డూ ప్రసాదానిదే సింహభాగం.పెరిగిన ధరలు, నాణ్యత ప్రమాణాలు పాటించాల్సి ఉండడంతో లడ్డూ ఆదాయం కంటే ఖర్చులు అదే స్థాయిలో ఉంటున్నాయి. కొండలడ్డూకు చెన్నయ్‌లోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ విభాగం ద్వారా ఆరేళ్లకు ముందు టీటీడీ మేథోసంపత్తి హక్కులు మంజూరు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here