సెప్టెంబర్ 25 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ పోరాట యాత్ర

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన జనసేన పోరాట యాత్ర షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 25 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో మలివిడత యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు జనసేన పార్టీ కార్యవర్గం ప్రకటించింది. కాగా సెప్టెంబర్ 23న నెల్లూరు జిల్లాలో పవన్ కల్యాణ్ ఒక్కరోజు పర్యటిస్తారని రాజకీయ వ్యవహారాల కమిటీ తెలిపింది. నెల్లూరులోని బారా షహీద్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని ఆ తరువాత రొట్టెల పండుగ వేడుకలో పాల్గొంటారని తెలిపింది. కాగా సెప్టెంబర్ 25 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు నుంచి మలివిడత పోరాట యాత్ర ప్రారంభం కానుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ తెలిపింది. జనసేన పోరాట యాత్రకు సంబంధించి ఆయా జిల్లాల సమన్వయకర్తలు, సంయుక్త సమన్వయకర్తలు, రాజకీయ వ్యవహారాల కమిటీ పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు.పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగనున్న పాదయాత్రలో పోలవరం ప్రాజెక్టును పవన్ కల్యాణ్ సందర్శిస్తారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో అక్కడ జరుగుతున్న ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారని జనసేన పార్టీ కార్యాలయ వర్గం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను కలసి, వారికి అందుతున్న న్యాయం, పునరావాసం వంటి అంశాలపై నేరుగా వారితోనే చర్చించనున్నారు. అలాగే పోలవరం ముంపు గ్రామాల్లో కూడా పవన్ కల్యాణ్ పర్యటిస్తారని తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లాలో పోరాట యాత్ర అనంతరం తూర్పుగోదావరి జిల్లాలోకి చేరుకుంటుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here