Local news

‘పులస’… కొన్నాళ్లాగితే…పుస్తెలమ్ముకున్నా దొరకదా..!!

పులస… ఈ పేరు మన తెలుగు వారికి బాగా పరిచయం వున్న పేరు. భోజన ప్రియులకు ఈ పేరు వింటేనే చాలు నోరూరుతుంది. ప్రతి యేటా వర్షా కాలంలో లభించే ఈ చేప కోసం మీన ప్రియులు ఎగబడుతుంటారు, తాము రుచిచూడడమే కాక దూర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులకు కూడా పంపిస్తుంటారు.. అంత క్రేజ్ ఉన్న పులసలు భారతదేశంలో ఒక్క గోదావరి జిల్లాలకే సొంతం.. ఏడాదిలో రెండు నెలలు మాత్రమే లభించే ఈ పులస ఫీవర్ గోదావరి జిల్లా వాసులను పట్టుకుంది. కేవలం ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో లభించే ఈ అరుదైన చేప అంటే మాంస ప్రియులు లొట్టలేసుకుని తింటారు. మాంసాహారంలోనే ఈ పులస చేపలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు మాంసాహారంలో చేపల పులుసుకు ప్రత్యేక స్థానముంటే చేపల పులుసులో ఈ పులస వంటకం ఎంతో ప్రత్యేకం. గోదావరిలో నిగనిగలాడే వెండి చేప వలకు దొరికితే నిధి దొరికినట్లేనని మత్స్యకారులు భావిస్తారు.

ఇంగ్లీష్ లో ఇలిష్ అని పిలవబడే ఈ చేప నిజానికి సముద్ర చేప, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గోదావరికి వచ్చిన వరద వల్ల, ఆ ఎర్ర నీటిలో సంతానోత్పత్తి కోసం గుడ్లు పెట్టడానికి ఎదురు ఈదుకుంటూ
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజీనియా నుంచి ఈ చేప వలస వచ్చి మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. గుడ్లు పెట్టడానికి సముద్రం నుంచి ఎదురీదుతూ వచ్చే ఈ చేప గుడ్లు పెట్టిన అనంతరం అక్టోబర్లో తిరిగి వెళ్లిపోతుంది. ధవళేశ్వరం బ్యారేజి దిగువున మాత్రమే ఈ పులస చేపలు దొరుకుతాయి. సముద్రంలోని ఉప్పునీటిలో ఉండే విలస చేపలు.. గోదావరిలోకి ఎర్రనీరు రాగానే ఎదురీదుకుంటూ వశిష్ట, వైనతేయ నదీపాయల గుండా ప్రయాణిస్తూ.. వరద నీటి నురుగును తింటూ జీవిస్తుంది. ఈ నీటిలో ఎదురీదుతూ ఉండటం వల్ల విలస శరీరానికి పట్టి ఉండే ఉప్పు లవణాలు కరిగిపోయి పులసగా మారి.. ఎక్కడా లేని రుచిని సంతరించుకుంటుంది. గోదావరి తీపి నీటితో పులస రంగు రుచి మారిపోతుంది. వలలో పడిన అనంతరం చనిపోయినా రెండు రోజులు తాజాగా ఉంటుంది. పులస చేపల్లో పోతుపులస, శనపులస అని రెండు రకాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆడ పులస ధర, రుచీ రెండూ ఎక్కువగా ఉంటాయి. 1469 కిలోమీటర్లు ఉన్న గోదావరిలో ఇవి లభ్యమవుతాయి. పులస చేప జాతి అరుదైన జాతి.
వీటని కృత్రమంగా సాగు చేయలేం. అందుకే దీని ధర అంత ఎక్కువగా ఉంటుంది. పులస చేపలు వెండి రంగులో తళతళలాడుతుంటాయి. పులస చేపలను రుచిగా వంటడం కూడా ఓ కళ. ఒకరోజు వండి నిల్వ ఉంచి తింటే ఇంకా మజాగా ఉంటుంది. పులస చేప మార్కెట్‌లో ఇంత ధర ఉంటుందని చెప్పడం కష్టం కిలో రూ.4 వేలకు చేరిన సీజనల్ ఫిష్ ధర ప్రతి ఏటా ధర మారుతూ ఉంటుంది. మెలైన పులస చేపలను పట్టడానికి ఎంతో సహనం కావాలి. రెండేళ్ల క్రితం వరకు కిలో పులస ధర రూ. వెయ్యి కంటే తక్కువగా ఉంటే ఈ ఏడాది అదే రేటు రూ. 2 వేల నుంచి రూ. 8 వేలకు చేరింది. ఈ చేపలు తక్కువగా దొరకటం వల్ల వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం నరసాపురం, అంతర్వేది, సిద్ధాంతం, రావులపాలెం లో ఎక్కువగా వీటి అమ్మకాలు ఉండి ఆ ప్రాంతాలు పులస ప్రియులతో కళకళలాడూతుంటాయి.
పులసకు ఉన్న డిమాండ్ దృష్ట్యా కేటుగాళ్లు మోసాలకు పాల్పడి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. కొందరు విలసలనే పులసలుగా అంటగడతారు. ఇలా వినియోగదారులు మోసపోకుండా కొన్ని చిట్కాలను చెబుతున్నారు మత్స్యకారులు.. విలసలు తెలపురంగులో ఉంటాయి.. పులస చేపలు సగం తెలుపు.. సగం గోధుమ రంగులో ఉంటాయి.. పులసను కోసినప్పుడు చక్రాకారంలో ఉంటాయి.. మిగిలిన ఏ చేపకు వలయాకారాలు ఉండవు..
అయితే గత కొన్నేళ్లుగా గోదావరి నదిలోకి వలస వెళ్లే హిల్సల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఓఎన్జీసీ, ఇతర సంస్థలు చమురు వెలికితీసే సమయంలో వచ్చే ప్రకంపనలతో హిల్సలు భయపడి.. తమ దారిని మళ్ళించుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హిల్సాలు తమ ప్రయాణం గోదావరికి కాకుండా చిలక సరస్సు, పశ్చిమ బెంగాల్‌లోని హుబ్లీ నది దిశగా పయనిస్తున్నాయని పరిశోధకులు గమనించారు. అయితే, అక్కడ పునరుత్పత్తికి అనువైన పరిస్థితులు లేకపోవడంతో అవి తిరిగి గోదావరి వైపు వస్తున్నా… వాటి ప్రయత్నం ఫలించడంలేదు. నదీ ముఖద్వారంలో వున్న ఆయిల్‌ రిగ్‌ల ప్రకంపనల కారణంగా అవి భయపడి గోదావరిలోకి ప్రవేశించే సాహసం చేయలేక సముద్రంలోకి తిరుగుముఖం పడుతున్నాయని చెబుతున్నారు.. ఇలాగే కొనసాగిస్తే.. పుస్తెలు అమ్ముకునైనా పులస తినాలనే సామెత తిరగబడి… మరికొన్నాళ్లాగితే… పుస్తెలు అమ్ముకున్నా తినేందుకు పులస దొరకదని అంటున్నారు.. బంగ్లాదేశ్ కు జాతీయ ఫిష్ కూడా పులస… చేప కావడం విశేషం..

Comment here