కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రంలో కదలిక

విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశంపై కేంద్రప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు కనబడుతోంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై టాస్క్స్ ఫోర్స్ తో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ గురువారం సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత త్వరగా వివరాలు సేకరించాలని మెకాన్ సంస్థకు ఆదేశాలు జారీచేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందంతో సమీక్షించిన కేంద్ర ఉక్కు శాఖ, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వివరాల కోసం వేచి చూడకుండా మిగిలిన అంశాలతో నివేదిక సమర్పించాలని మెకాన్ కు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ నిర్దేశించారు. ముడి ఇనుప ఖనిజం లభ్యత, గనుల లీజు, తదితర కీలక అంశాలకు సంబంధించిన వివరాలు త్వరగా రప్పించాలని మంత్రి బీరేంద్ర సింగ్ ఆదేశించారు. ప్రభుత్వం లేదా ప్రైవేటు, ఉమ్మడి భాగస్వామ్యంతో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసే అవకాశంపైనా చర్చించినట్టు తెలుస్తోంది. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణ నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here