త్రేత్రాయుగం నాటి క్షేత్రం… శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి క్షేత్రం .

వ్యాసుడు రచించిన పురాణాలలో వాయుపురాణం ఒకటి. ఆ పురాణం లో గోస్తనీ నది గురించి, ఉమా మహేశ్వర క్షేత్రం గురించి రాసారు. సాక్షాత్తూ ఆ క్షేత్రమే నేటికి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం లో జుత్తిగ గ్రామంలో అలరారుతుంది. సుందరమైన ప్రకృతి రమణీయతల మధ్య నిర్మితమైన చారిత్రక దేవాలయం ఇది. ఈ ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుచున్నది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులంతా ఆధ్యాత్మిక ఆనందానికి గురౌతారు. ఈ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ని సేవించేవారికి శత్రు, రుణ, రోగ, మృత్యు భయాలు ఉండవని అంటారు. సోమవారం నాడు ఈ శివలింగాన్ని సేవించి అన్నదానం చేస్తే కోటి రెట్లు ఫలితం కలుగుతుందంట. మహా శివరాత్రి పర్వదినాన ఈ శివలింగాన్ని కి అభిషేకం చేసి అర్చించిన వారు పునర్జన్మ రహితమైన కైవల్యం పొందగలరు. జుత్తిగలోని సోమేశ్వర స్వామి ఆలయం కాశీ క్షేత్రమంత పవిత్రమైనది.
త్రేతాయుగంలో రావణాసురుడు, అతని పరివారం దేవతలందరిని పీడిస్తుండేవారు. అల ఒకనాడు రవి, వాసుకి, సోముడు రావణ భటులచే పరభావింపబడి దుఃఖిస్తుండగా, బ్రహ్మచూసి వారి దుఃఖాన్ని పోగేట్టేందుకు, రావణవధ శ్రీఘ్రంగా జరిగి లోక కళ్యాణం జరిగేందుకు వారికి ఒక సలహా ఇచ్చారట. బ్రహ్మ ఆదేశానుసారము ఉమా, వాసుకి, సూర్య చంద్రులు గోస్తనీ నది తీరంలో ఉత్తర వాహిని, నిత్య పుష్కరిణి ఉన్నచోట పశ్చిమాభి ముఖంగా శివలింగాన్ని ప్రతిష్టించి కొలవసాగారు. అలా త్రేతాయుగంలో నెలకొల్పబడిన ఈలింగమే శ్రీ ఉమావాసుకీ సోమేశ్వర లింగం. 15 వ శతాబ్దంలో కిల్జీ పాదుషా వారి ఆజ్ఞానుసారం సత్తిరాజు వంశస్తులచే ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగినట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. సత్తిరాజు వంశస్తులే ఆలయ నిర్వహక ధర్మకర్తలుగా వస్తూ ఉంటున్నారు.
ఆలయ గోపురాలు రమణీయ ప్రతిమలతో దర్శనమిస్తాయి. గర్భాలయంలో శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి లింగం స్పటిక స్వచ్ఛంగా, పవిత్రంగా భాసిస్తుంది. స్వామికి మహన్యాస, నమక, చమక సంపుటీకరణ తో అభిషేకాలు, బిల్వార్చన భక్తులు నిర్వర్తింప చేసుకుంటూ ఇహపర ఫలితాలను అందుకుంటారు. ఈ ఆలయంలో ఉత్తరాన దక్షిణాభి ముఖంగా పార్వతీదేవి భక్తులకు దర్శనం ఇస్తున్నది. గర్భాలయన అమ్మవారు స్వర్ణ కిరీట ధారినై కుంకుమార్చనలను అందుకుంటూ ఉంటుంది. ఈ ప్రాంగణంలో అనేక దేవి, దేవతల ఆలయాలు ఉన్నాయి. పార్వతిదేవి ఎడమ భాగాన శ్రీభద్రకాళి, వీరభద్రేశ్వరుల ఆలయం ఉంది. మండప స్తంభాలు నయన మనోహరంగా ఉంటాయి. ప్రధాన ఆలయం శివలింగానికి ఎదురుగా ముఖ మండపంలో శ్రీ శారదాదేవి, శ్రీ అనిస్రమ్మదేవి దర్శనమిస్తారు. ఇక్కడ లక్ష్మి జనార్ధనస్వామి ఆలయం ఉంది. వైశాఖ శుద్ధ త్రయోదశి నుండి పౌర్ణమి వరకు లక్ష్మి జనార్ధనస్వామి కళ్యాణ మహోత్సవాలు జరుగుతుంటాయి. ఆలయానికి ఈశాన్యం లో శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం, శ్రీ కాలభైరవస్వామి వారి ఆలయాలు ఉన్నాయి. సప్తస్వరాధారుడైన సూర్యనారాయణుదు, ఛాయాదేవి సహితంగా ఉషఃకిరణ కాంతులతో దర్శనమిస్తాడు. శ్రీ కాలభైరవస్వామి ఆలయాన్ని 1924 వ సంవత్సరంలో సత్తిరాజు వంశస్తులే ప్రతిష్టించారు. ప్రధాన ఆలయానికి ఆగ్నేయంలో గణపతి, నైరుతి దిక్కున శ్రీ దుర్గాదేవి ప్రతిష్టుతులై పూజలందుకుంటున్నారు. అలాగే 1958 లో నిర్మించిన దూతికా దేవి ఆలయం ఇక్కడ నెలకొని ఉంది. ఇక్కడ 1997-98 వ సంవత్సరంలో నవగ్రహ మండపాన్ని నిర్మించారు. ఆలయ రెండవ ప్రాకారంలో శ్రీ వల్లి సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నెలకొని ఉన్నారు. ఇది 1907 వ సంవత్సరంలో నిర్మింపబడినది. ఇక్కడ షష్టి నాడు కళ్యాణం, ప్రతి మంగళవారం పూజలు జరుగుతాయి. మార్గశిర శుద్ధ పంచమినాడు శ్రీ వల్లిదేవి సుబ్రహ్మణ్యస్వామి వారి కళ్యాణం, తీర్దం జరుగుతాయి. ఈఊరిలో గల శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం బహు ప్రసిద్దం. ఈ ఆలయములో సంతానము లేని దంపతులు పూజలు చేసిన సంతానము కలుగుతుందని నమ్ముతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరువలోనే చంద్ర పుష్కరిణి ఉన్నది. మొదటి ప్రాకారానికి ఉత్తర దిక్కులో శ్రీ కంచి కామాక్షి ఆలయం కూడా సందర్శించుకోవచ్చు. కంచి కామాక్షి దేవి కి కుంకుమపూజలు విశేషంగా నిర్వహిస్తారు.
సుందరమైన ప్రకృతి రమణీయతల మధ్య నిర్మితమైన చారిత్రక దేవాలయం ఇది. ఈ ఆలయం భక్తులకు కోర్కెలను తీర్చే కల్పతరువుగా విరాజిల్లుచున్నది. ముఖ్యంగా రోగపీడితులు స్వామికి మృత్యుంజయ అభిషేకం చేయించటం, సుఖజీవన సంప్రాప్తికి సోపానంగా విశ్వసిస్తారు. మాఘ బహుళ దశమి నుండి అమావాస్య వరకు ఏటా ఉమా వాసుకి రవి సోమేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి.
జుత్తిగను సందర్శించేందుకు తణుకు నుండి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మండల కేంద్రమైన పెనుమంట్రకు సమీపంలో ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి ఆటోలు, ఇతర ప్రయాణ సాధనాలు అందుబాటులో ఉన్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం నుండి ఈ క్షేత్రము 14 కి.మీ. దూరంలో వున్నది. తాడేపల్లి గూడెం నుండి 28 కి.మీ. అత్తిలి నుంది. 6 కి.మీ. మార్టేరు నుండి 15 కి.మీ. దూరంలో ఈక్షేత్రమున్నది..

వేరొక కధనం ప్రకారం :-
జుత్తిగ, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలానికి చెందిన గ్రామము. ఇక్కడ సోమేశ్వరస్వామివారి ఆలయము ఉంది. ఈ ఆలయమును దేవతలే నిర్మించారని చెపుతారు. దీని ప్రాకారములోనే నవగ్రహాల గుడి, సోమేశ్వరాలయము ప్రక్కగా కంచి కామాక్షి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఈఊరిలో గల శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం బహు ప్రసిద్దం. ఈ ఆలయములో సంతానము లేని దంపతులు పూజలు చేసిన సంతానము కలుగుతుందని నమ్ముతారు.
పంచాయతన క్షేత్రాలలో ఒకటైన జుత్తిగలో ప్రఖ్యాతి చెందిందిన శివాలయం. గోస్తనీ తీరంలో ఈ శివలింగాన్ని బ్రహ్మదేవుని ఆదేశం ప్రకారం వాసుకి, సూర్య చంద్రులు ప్రతిష్ఠించారన్నది పౌరాణిక కథనం.రావణాసురుడు పెట్టే బాధల నుంచి విముక్తి కోసం వీరంతా ప్రార్థించిన మీదట బ్రహ్మదేవుడు ఇచ్చిన సలహాతో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ క్షేత్రంలో అన్న దానం చేస్తే ఈతి బాధల నుంచి విముక్తి పొందడమే కాకుండా, కోటి రెట్ల ఫలం లభించగలదని కూడా తరతరాలుగా భక్తుల నమ్మకం. ఈ ఆలయం ప్రాంగణంలో నిత్య పుష్కరిణి ఉంది. పార్వతీదేవి, భద్రకాళీ వీరభద్రేశ్వరుల విగ్రహాలు ప్రతిష్ఠితమైనాయి. శివలింగానికి ఎదురుగా ముఖమండపంలో అనీశ్వరమ్మ, శారదాదేవి, కుమారస్వామి విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఈ ఆలయానికి వాయవ్యవ దిశలో లక్ష్మీ జనార్దన స్వామి పూజలందుకుంటున్నాడు. ప్రత్యక్ష దైవమైన శ్రీసూర్యనారాయణమూర్తి, కాలభైరవ స్వామి, విఘ్నేశ్వరుడు, దుర్గాదేవి విగ్రహాలు కూడా ప్రతిష్ఠితమై ఉన్నాయి.
ఉమా వాసుకీ రవి సోమేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాలను మాఘమాసం బహుళ పక్షంలో దశమి నుంచి అమావాస్య వరకూ నిర్వహిస్తారు. అలాగే, వైశాఖ మాసంలో శ్రీలక్ష్మీ సమేత జనార్దనస్వామి వారికి, మార్గశిర మాసంలో శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామికి కల్యాణోత్సవాలను నిర్వహిస్తారు.
జుత్తిగలో స్వయంభూగా వెలసిన శ్రీసుబ్రహ్మణ్యశ్వరస్వామిని అర్చిస్తే సంతాన ప్రాప్తి లభిస్తుందనేది భక్తుల నమ్మకం. సుబ్బారాయుడి షష్టికి ఈ గ్రామంలో నిర్వహించే తీర్థానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాక, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని అర్చిస్తే సంతాన యోగం మాత్రమే కాక కార్యసిద్ధి లభిస్తుందనీ, ఈతి బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం, ఈ ఆలయం ప్రాంగణంలో ఉన్న దుర్గామాతకు దసరాల్లో అతివైభవంగా దేవీనవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here