Local news

భారతి పై వస్తున్న కథనాలపై జగన్ బహిరంగ లేఖ

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల విషయంలో సిబిఐ 11 చార్జ్ షీట్స్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులుగా జగన్, విజయసాయిరెడ్డి, భారతీ సిమెంట్స్, కార్పోరేషన్, జే.జగన్మోహన్ రెడ్డి, సిలికాన్ బిల్డర్, సండూర్ పవర్ లిమిటెడ్ క్లాసిక్ రియాలిటీ, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ లు ఉన్నాయి.. కానీ మొట్ట మొదటిసారిగా జగన్ భార్య భారతిపై అభియోగాలు నమోదయ్యాయి. జగన్ ఆస్తుల కేసులకు సంబంధించిన ఛార్జ్ షీటులో ఆయన భార్య భారతి పేరును ఈడీ చేర్చింది. భారతీ సిమెంట్స్‌కు సంబంధించి హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీటులో ఆమెను ఏ5గా చేర్చినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైంది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ అభియోగపత్రం దాఖలైంది. తాజాగా ఆమె పేరును ఈడీ చేర్చడం చర్చనీయాంశంగా మారింది.రఘురామ్ సిమెంట్స్ ఒప్పందంలో వైఎస్ భారతి అనే పేరుతో డబ్బు లావాదేవీలు జరిగాయని ఈడీ పేర్కొంది. రఘురామ్(భారతి) సిమెంట్స్‌లో సండూర్ పవర్, కారమేల్ ఏషియా లిమిటెడ్, ఇతర కంపెనీలు హవాలా ద్వారా నిధులను మళ్లించినట్లు ఆరోపించింది. PMLA చట్టం సెక్షన్ 3 కింద నిందితులను ప్రత్యేక కోర్టు శిక్షించాలని ఈడీ కోరింది.
ఈడీకి కోర్టు అనుమతిస్తుందో లేదో….తెలియకుండానే ఆమె పేరుతో కథనాలు వెలువడడం పై జగన్ మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలు చూసి తాను షాకయ్యానని .. మీడియా లో వస్తున్న కథనాలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ కథనాలపై స్పందించారు. వాస్తవాలను ప్రజల ముందుకు తెచ్చేందుకు జగన్…ఓ లేఖను రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులను ఉద్దేశించి జగన్ రాసిన సుదీర్ఘ లేఖ యథాతథంగా… మీకోసం ఓ సుదీర్ఘ లేఖను జగన్ రాశారు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు – దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులకు… ‘‘ఈడీ కేసులో నిందితురాలిగా వైయస్ భారతి’’ అని ఒక పత్రికలో ‘‘ముద్దాయిగా భారతి’’ అంటూ మరో పత్రికలో ప్రచురించిన వార్తను చూసి నిర్ఘాంతపోయాను. తనను ఫలానా కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిందితురాలిగా చేరుస్తున్నారన్న వార్త శ్రీమతి భారతి – నేను కొన్ని ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్తను చూసి తెలుసుకోవాల్సి వచ్చింది.
అయితే జడ్జీగారు పరిగణలోకి తీసుకున్న తరువాతే చార్జిషీట్ లో ఏముంది అన్న విషయం మాకైనా – ఎవరికైనా తెలుస్తుంది. అలాంటిది జడ్జిగారు పరిగణలోకి తీసుకోకముందే.. మాకే తెలియకుండా ఈ విషయం నేరుగా ఈడీ నుంచి కొన్ని పత్రికలకు ఎలా తెలిసింది? ఎవరు వారికి చెప్పారు? మా మీదే బురద చల్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? నా మీదే కాకుండా మొత్తంగా నా కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేయాల్సినంతటి శత్రుత్వం ఎవరికి ఉంది? సీబీఐ తన విచారణలో పేర్కొనని కంపెనీలను – వ్యక్తుల్ని ఇన్నేళ్ల తరువాత చార్జిషీట్లలో ఎందుకు చేరుస్తున్నారు? అసలు శ్రీమతి భారతి ఈ కేసులలో సంబంధం ఏమిటి? ప్రతి ఒక్కరూ ఆలోచించండి అని విజ్ఞప్తి చేస్తూ – కొన్ని అంశాలను రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంచటం మంచిదన్న అభిప్రాయంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.
నా మీద గత ప్రభుత్వం వేసిన కేసులు 2011 ఆగస్టు 10న ప్రారంభం అయితే నేడు 2018 ఆగస్టు 10. కేసు ప్రారంభమై ఏడేళ్లు గడిచిపోయింది. ఎన్నో చార్జిషీట్లు వేశారు. అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టారు. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. మహానేత మరణం తరువాత – మాటకు కట్టుబడి ఓదార్పు చేస్తానన్నందుకు పెద్దయెత్తున ప్రజాదరణ దక్కుతున్నందుకు తెలుగుదేశం-కాంగ్రెస్ కుమ్మక్కు అయి నా మీద కేసులు వేశాయి. ఏడేళ్లుగా ఏటికి ఎదురీదుతున్నా ఏనాడూ భయపడలేదు. సత్యమేవ జయతే అని నమ్మాను కనుకే అన్నింటినీ భరిస్తున్నాను. ఈ రోజు కొన్ని మీడియా వార్తల్ని బట్టి చూస్తే – శ్రీమతి భారతిని కూడా కోర్టు చుట్టూ తిప్పాలని కంకణం కట్టుకున్నారని తెలుస్తోంది.
అయితే ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేయాల్సి ఉంది.. అదే ఉమాశంకర్ గౌడ్ – గాంధీ.. అనే ఈ ఇద్దరూ మమ్మల్ని వేధిస్తున్న విషయం దాదాపు 17నెలల క్రితం భారత ప్రధానిగారికి లేఖ ద్వారా తెలియజేశాం. ఆ అధికారుల కాల్ డేటా మీద దర్యాప్తు చేస్తే వీరు ఎవరి ప్రోత్సాహంతో చేస్తున్నారో తెలుస్తుంది. వీరిలో గాంధీ అనే అధికారి బదిలీ అయినా- కేంద్రం సహాకారంతో మూడుసార్లు తన పదవీ కాలాన్ని పొడిగించుకున్నారు. ఇప్పుడు ఆ అధికారుల చేతే అధికార ప్రభుత్వం మామీద కక్ష సాధింపు రిపోర్టుల్నిరాయిస్తున్నారు అని నేను భావిస్తున్నాను.
చంద్రబాబుగారు అస్తమాను ప్రస్తావించే వైసిపి, బిజిపీ ల బంధం నిజమైతే… ఈ విషయం ఇంట దూరం వచ్చేదా..? అసలు ఈ కేసులతో ఏ సంబంధమూ లేని నా భార్యను కూడా కక్ష పూరితంగా- అదీ ఏడేళ్ల తరవాత ఈడీ వారు చార్జిషీట్లో పెట్టి ఉండేవారా? ఈ తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా నామీద కేసుల విషయంలో భయపడకుండా రాజీపడకుండా.. సమైక్య ఆంధ్రప్రదేశ్ పోరాటం నుంచి ప్రత్యేక హోదా పోరాటం వరకు ధైర్యంగా రాష్ట్ర సమస్యల మీద ఉద్యమించాం తప్ప కాడి అవతల పారేయలేదు… లాలూచీ ఆలోచనలు చేయలేదు. తెర వెనుక రాజకీయాలు చేతగావు.
ఆంధ్రప్రదేశ్ ను అవినీతి ప్రదేశ్ గా మార్చిన చంద్రబాబు కొండంత అవినీతి సంగతులు అన్నీ కాకపోయినా కొన్ని అయినా ప్రస్తావనకు వచ్చాయి. ఇవన్నీ విచారణ జరగాల్సిన అంశాలే. అయినా ఇందులో ఏ ఒక్కఅంశం మీదా ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా బాబుమీద విచారణ జరగటం లేదు..
ప్రజలకు మంచి చేసి కాకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేసి.. ‘ప్రత్యర్థిపక్షాన్ని’ప్రజల్లో ఎదుర్కోలేక వ్యవస్థల ద్వారా దెబ్బతీసి.. అధికారంలో కొనసాగాలనకుంటున్నాడు కాబట్టే చంద్రబాబు ముందుగా నా తండ్రిగారిని టార్గెట్ చేశాడు. తరువాత నన్ను టార్గెట్ చేశాడు. ఇప్పుడు నా భార్య శ్రీమతి భారతిని తన మనుషులతో టార్గెట్ చేయిస్తున్నాడు. ఇలాంటి వ్యవహారాల్ని ఆమోదిస్తే ఇక ఈ దేశంలో ఎవరికి రక్షణ ఉంటుంది? ప్రజాస్వామ్యం ఎక్కడ బతికి ఉంటుంది? రాజకీయాలంటే ఛీ అని ఎవరికైనా అనిపించదా? అందరూ ఆలోచించండి? అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన లేఖ ద్వారా ప్రజలను ప్రశ్నించాడు… మరి ఈ లేఖపై టిడిపి, బిజేపీ నాయకులు స్పందించాల్సి ఉంది..

Comment here