రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెసుకు మరో ఆయుధం అందించిన ఫ్రెంచి పత్రిక

రాఫెల్ యుద్దావిమానాల కొనుగోలుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సాగిస్తున్న ఉధృతమైన దాడికి బలం చేకూర్చే మరో ఆయుధం దొరికింది. 36 రాఫెల్ విమానాల ఒప్పందం కుదరాలంటే అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్(ఆర్డీ) సంస్థను ఆఫ్ సెట్ భాగస్వామిగా ఒప్పుకోవాల్సిందేనని, డీల్ సాకారం కావడానికి రిలయన్స్ తో జాయింట్ వెంచర్ తప్పనిసరి అని ఆ జెట్ల తయారీ సంస్థ దసో ఏవియేషన్ అంతర్గతంగా అంగీకరించినట్లు తాజాగా బయట పడింది. దసో లోని ఓ ఉన్నతాధికారి తన సిబ్బందికి ఈ విషయమై స్పష్టతనిచ్చి దీన్ని ధృవపర్చినట్లు వెల్లడయింది. ఈ బాంబు పేల్చింది కూడా ఫ్రెంచి పరిశోధనాత్మక వార్తాపత్రిక మీడియా పార్ట్. ” ఈ కాంట్రాక్ట్ చేజిక్కించుకోవాలంటే రిలయన్స్ ను అంగీకరించడం అనివార్యం. ఇది ఒక వాణిజ్యపరమైన రాజీ” అని దసో డిప్యూటీ సీఈవో లోయిక్ సెగా లెన్ 2017 మే 11వ తేదీన నాగపూర్ లో దసో ప్రతినిధులకు ఆ అధికారి చెప్పినట్లు, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నట్లు మీడియా పార్ట్ లో తాజాగా ప్రచురితమైన కథనం వెల్లడించింది. లోయిక్ సెగాలెన్, దసో సంస్థలో అధికార శ్రేణిలో రెండో స్థానంలో ఉన్న అత్యంత కీలకమైన వ్యక్తి. ” ఇది మనకు ఓ ఆబ్లిగేషన్.. భారమైనా అనివార్యం. రాఫెల్ ఇండియా డీల్ లో రిలయన్స్ ను మనం భాగస్వామిగా కొనసాగించాలి” అన్నారాయన. ఈ వివరణతో రాఫెల్ లో అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ ను ఎంపిక చేసుకుందని వివరణ ఇచ్చినా దాని వెనుక ఒత్తిడి ఉన్నట్లు ఈ కథనం బయటపెడుతోంది. రిలయన్స్ సంస్థను ఆఫ్ సెట్ భాగస్వామిగా భారత ప్రభుత్వమే ఎంపిక చేసుకుందని, ఇందులో తమకు వేరే ప్రత్యామ్నాయం లేకపోయిందని, దసో సంస్థ నేరుగా రిలయన్స్ తోనే సంప్రదింపులు జరుపుకోవాల్సి వచ్చిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు, ఒప్పందంనాటి అధ్యక్షుడు అయిన హోలాండ్ గత నెల 22న మీడియా పార్ట్ ఇంటర్వ్యూలోనే బయట పెట్టిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here