National

రాఫెల్ ఒప్పంద నిర్ణయ ప్రక్రియ చర్యల వివరాలు వెల్లడించండి : సుప్రీంకోర్టు

రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంపై నిర్ణయ ప్రక్రియ సమయంలో తీసుకున్న చర్యల వివరాలను వెల్లడించాలని కేంద్ర ప్రభత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది. అయితే జెట్ సామర్థ్యత, ధరల గురించి సమాచారం కోరుకోవడం లేదని రంజన్ గొగోయ్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 36 యుద్ధ విమానాల తయారీకి ఫ్రాన్స్ కు చెందిన దస్సాల్ట్ కంపనీతో 59 వేల కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుందని దీనిపై సీల్డ్ కవర్లో సమాధానం ఇవ్వాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని ఎంఎల్ శర్మ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై విచారణ చేపట్టడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ఆఫ్ రాజ్యసభ సభ్యుడు కూడా తన న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండ్ కలసి ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం మాట్లాడుతూ మేము ప్రభుత్వానికి నోటీసు జారీ చేయం, పిటీషనర్ చేసిన వాదనలో జోక్యం చేసుకోమని స్పష్టం చేస్తున్నాం. వారి వాదనలు పూర్తి ఆమోదయోగ్యంకానివి అని ధర్మాసనం పేర్కొంది. ఈ ఒప్పందంలో నిర్ణయాధికారం తీసుకున్న అంశాలపై మమ్మల్ని సంతృప్తి పరచాలని మేము కోరుకుంటున్నాము. ఈ సమస్య సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని అనుమానాస్పద సమస్యగా మార్చాలని అనుకోవడం లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ ఈ పిటీషన్ రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు.

Comment here