NationalUncategorized

కేంద్రమంత్రి ఎంజే అక్బర్ రాజీనామా

లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ రాజీనామా చేశారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన జర్నలిస్టు ప్రియారమణిపై ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం కేసు వేసిన మంత్రి అనూహ్యంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా నిర్ణయాన్ని ఓ ప్రకటనలో ఆయన తెలియజేశారు. న్యాయం కోరుతూ తాను కోర్టును ఆశ్రయించానని, వ్యక్తిగత హోదాలోనే న్యాయపోరాటం చేయాలనుకుంటున్నానని ఎంజే అక్బర్ తెలిపారు. అలాగే తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను వ్యక్తిగత స్థాయిలోనే ఎదుర్కొంటానని అన్నారు. ఆ కారణంగానే తాను రాజీనామా సమర్పించినట్లు చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు తనకు మంత్రిగా అవకాశమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “మీ టూ” ఉద్యమం మొదలైన తర్వాత రాజీనామా చేసిన తొలివ్యక్తి ఎంజే అక్బర్ కావడం గమనార్హం. జర్నలిస్టు ప్రియారమణి గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో తనపై లైంగిక వేధింపులు జరిగినట్టు చెప్పారు. అయితే ఎవరి పేరూ అప్పట్లో ఆమె ప్రస్తావించలేదు. గతవారం ఆమె సోషల్ మీడియాలో ఏంజే అక్బర్ పేరు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. మంత్రి రాజీనామా చేయాలంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే ఆరోపణలు వచ్చిన సమయంలో విదేశాల్లో అధికార పర్యటనలో ఉన్న మంత్రి ఎంజే అక్బర్ కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ తిరిగివచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని, లీగల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ మరుసటి రోజే ఆయన ప్రియారమణిపై ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం కేసు వేశారు. “మీ టూ” ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో ప్రియారమణి చేసిన ఆరోపణలు సంచలనం రేపగా, పలువురు మహిళా జర్నలిస్టులు సైతం ఎంజే అక్బర్ పై ఇదే తరహా ఆరోపణలు చేయడంతో పరిస్థితి మరింత ముదిరి మంత్రి రాజీనామాకు దారి తీసింది.

Comment here