National

క్షీణించిన కరుణానిధి ఆరోగ్యం…హెల్త్ బులెటిన్ విడుదల

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఏడాదిన్నరగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవలే కోలుకున్నారు. 94 ఏళ్ల కరుణానిధి ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని కావేరీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్‌ విడుదల చేశారు. జ్వరం, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌ కారణంగా ఇబ్బంది పడుతున్నారని ప్రకటించారు. కరుణను నిరంతరం వైద్య నిపుణులు, నర్సింగ్ నిపుణులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
రెండ్రోజులుగా కరుణానిధి బాగా నీరసించడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తండ్రి అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే మదురై నుంచి కరుణ పెద్ద కుమారుడు అళగిరి చెన్నై నగరానికి చేరుకున్నారు.
మరోవైపు కరుణానిధి ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో.. ఆయన నివాసానికి రాజకీయ నేతలు క్యూ కట్టారు. తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతో పాటు పలువురు మంత్రులు, నేతలు కలైంజర్ ఇంటికి తరలివచ్చారు. స్టాలిన్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరుణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. కరుణానిధి అనారోగ్యానికి గురయ్యారన్న వార్తలతో డీఎంకే శ్రేణులు కలవరం చెందుతున్నాయి. ఆయన నివాసానికి వేల సంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నారు

Comment here