ప్రజలకు పంద్రాగస్టుకి కేసీఆర్ కానుక… కంటి వెలుగు

సర్వేద్రియానం నయనం అన్నారు పెద్దలు.. అంటే ఇంద్రియాల్లో కళ్ళు అతి ముఖ్యమైనవి… ప్రపంచాన్ని చూపించే కంటికి వెలుగులు నింపడానికి తెలంగాణా సర్కార్ కంటి వెలుగు కార్యక్రమం తో ప్రజల ముందుకు త్వరలో రానున్నది.
అవును కెసిఆర్ సర్కార్.. తెలంగాణా రాష్ట్ర ప్రజలకు పంద్రాగస్టు కానుక ఇవ్వనుంది. సాత్ర్నత్య దినోత్సవం రోజున కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమం సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో లో కెసిఆర్ చేతులమీదుగా ప్రారంభం కానున్నది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలను ప్రభుత్వం చేయిస్తుంది. అవసరమైన వారికి మందులు, కళ్ళజోళ్ళు అందిస్తారు. అంతేకాదు.. ఎవరికైనా ఆపరేషన్లు అవసరం అయితే… ప్రభుత్వమే ఉచితంగా చేయించాలని నిర్ణయించింది. కంటి వెలుగు కార్యక్రమం ఆగష్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
అంతేకాకుండా గవర్నర్ నరసింహన్‌ను కూడా ఒక ప్రాంతంలో కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరనున్నట్లు ప్రకటించారు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు.ఈ
కంటి వెలుగు కార్యక్రమానికి అవసరమైన సిబ్బందిని, వైద్య పరికరాలు, వాహనాలు, కళ్లద్దాలు, మందులను ముందుగానే రెడీ చేసుకోవాలని కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇంత పెద్ద కార్యక్రమం గతంలో ఎవరూ ఎప్పుడూ చేయలేదన్నారు. జిల్లా కలెక్టర్లు.. ప్రజా ప్రతినిధులందరితో సమావేశాలు నిర్వహించి జిల్లా స్థాయిలో షెడ్యూల్‌ను తయారు చేయాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో కార్యక్రమ నిర్వహణపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అందరూ కంటి వైద్య శిబిరాలకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

అటు..కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు నిర్వహణ కోసం 799 బృందాలను ఏర్పాటు చేశామని.. ప్రతీ బృందంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఆప్తమాలజిస్ట్‌, ఏఎన్‌ఎం తదితరులు ఉండనున్నట్లు తెలిపారు.

ఒక్కో వైద్య బృందం రోజుకు సగటున 250 మందికి పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పారు. ఐ డ్రాప్స్, మందులు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 35 లక్షల కంటి అద్దాలు సిద్ధం చేసి జిల్లాలకు పంపుతున్నామని.. అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా 114 కంటి ఆస్పత్రులను గుర్తించినట్లు తెలిపారు.
ఇలా కంటి వెలుగు నింపేలా గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో రాష్ట్రంలోని దాదాపు 3.70 కోట్ల మంది పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహణ చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here