జనసేన మహిళలకు అండగా ఉంటుంది : పవన్ కల్యాణ్

దేశంలో మొట్ట మొదటి ప్రాధాన్యతాంశం మహిళల రిజర్వేషన్లేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.., ఆడపడుచుల కష్టాలు తనకు తెలుసన్నారు. జనసేన మహిళలకు అండగా ఉంటుందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు జనసేన కట్టుబడి ఉందన్నారు.బీజేపీ నాలుగేళ్లుగా మహిళా బిల్లును ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఇష్టారీతిన మాట్లాడితే మూల్యం చెల్లించక తప్పదన్నారు. అధికారంలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. తనకు కులరాజకీయాలు తెలియవన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను టీడీపీ నీరుగార్చిందని విమర్శించారు. జనసేన యువతకు అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పారు. యువత భవిష్యత్తు అంధకారంలో పడకూడదన్నదే తన ధ్యేయమన్నారు. తాను మనిషిగా పుట్టానని, కులాలను నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదన్నారు. జగన్, చంద్రబాబు లా తాను కులాన్ని నమ్ముకోలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు సరిచేయకుంటే వ్యవస్థ సర్వనాశనం అవుతుందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. తాను అన్ని కులాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనకు కులం, మతం లేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ పశ్చిమగోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లు ఎవరివివల్ల గెలిచారో మర్చిపోయి విమర్శలు చేయడం బాధాకరమన్నారు. టీడీపీని ప్రశ్నిస్తుంటే బీజేపీ తొత్తు అంటున్నారని జనసేనాని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here