రెండో టెస్టులో భారత్ ఘన విజయం

ఇండియా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ను కూడా టీమిండియా మూడోరోజే ముగించింది. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీసును భారత్ 2-0 తో గెలుచుకుంది. మూడో రోజు 308/4తో ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ మరో 59 పరుగులు మాత్రమే చేసి(367/10) మిగతా 6 వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్ 56 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ ను భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ తో క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ 127 పరుగులకే ఆలౌట్ చేశారు. తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసిన ఉమేష్ యాదవ్, రెండో ఇన్నింగ్స్ లో కూడా విజృంభించి 4 వికెట్లు తీసాడు. టెస్టు కెరీర్లో ఉమేష్ యాదవ్ కు 10 వికెట్లు తీయడం ఇదే తొలిసారి కావడం విశేషం. మిగతా బౌలర్లలో జడేజా 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ తీశారు. అనంతరం 72 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు పృధ్వీషా,(33), కెఎల్ రాహుల్(33) భారత్ కు సునాయాస విజయం అందించారు. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో భారత్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయం సాధించిన కోహ్లీ సేన, రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. రెండు ఇన్నింగ్స్ లో అద్భుతమైన బౌలింగ్ చేసి 10 వికెట్లు తీసిన ఉమేష్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అలాగే ఆరంగ్రేట టెస్టు మ్యాచ్లోనే అద్భుత సెంచరీ(134) తో పాటు, రెండో టెస్టులో కూడా అర్ధ సెంచరీ(70,33)తో రాణించి మొత్తం 237 పరుగులు చేసిన యువ కెరటం పృధ్వీషా కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
వెస్టిండీస్: 311 & 127
ఇండియా: 367 & 75/0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here