Devotional

గ్రహణ గండాలకు శ్రీకళహస్తి ప్రత్యేకం… ఎందుకో… తెలుసుకుందాం..!!

తిరుపతికి తూర్పున సువర్ణముఖి నది ఒడ్డున గల కొండల మధ్య కొలువై ఉన్న దేవాలయం శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం. రీ అనగా సాలెపురుగు, కాళము అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ ప్రాంతంలో స్వయం భూలింగముగా వెలసిన శివలింగాన్ని అర్చిమ్చాడంలోను… తమ భక్తి నిరూపణలో పోటీగా నిలిచి ఈ మూడు మోక్షమును పొందాయని ఒక కథ. కనుకనే ఈ స్వామి శ్రీ కాళ హస్తీశ్వరుడని పిలవబడుతున్నాడు. అంతేకాదు…ఇక్కడ మరో విశేషం ఏమిటంటే భక్తకన్నప్ప కూడా స్వామీ వారిని పూజించి తన రెండు కళ్ళను అర్పించిన చోటు అని ప్రసిద్ధ
సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమున కెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని ‘దక్షిణ కాశీ ‘ అని అంటారు.
స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్టుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన దూర్జటి) వంటి వారి కధలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.
ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించిన పుణ్య క్షేత్రం..
శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖుని గాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు)గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని కధనం..
ఇక్కడ వెలసిన వాయులింగేశ్వరుని.. సూర్యచంద్రాగ్ని లోచనుడిగా పిలుస్తారు. అంతేకాకుండా సూర్యచంద్రాదులతో పాటు అగ్నిభట్టారకునితో పాటు తొమ్మిది గ్రహాలు, 27 నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. అందువల్ల ఇక్కడి క్షేత్రంలో రాహు, కేతువుల ఆటలు సాగవు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా భక్తులందరూ ఇక్కడి క్షేత్రంలో రాహు, కేతు సర్పదోష నివారణ పూజలను చేయించుకుని వారి దోషాలను నివృత్తి చేసుకుంటున్నారు. ఈ కారణాలతో.. సూర్య, చంద్ర గ్రహాణాల సమయంలో ఇక్కడి ఆలయాన్ని తెరిచి గ్రహణ కాల అభిషేకాలు జరపడం ఇక్కడి వైశిష్ఠ్యం.
రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి.
ఇక ముఖ్యంగా ఈ క్షేత్రంలో సూర్య గ్రహణం అంటే గ్రహణం ప్రారంభమయ్యే సమయంలోను, అదే చంద్రగ్రహణం అయితే గ్రహణం విడిచే సమయంలో ఇక్కడి ఆలయంలో కొలువుదీరిన శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి ధృవమూర్తులకు శాంతి అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.

Comment here