రివ్యూ: కన్ ఫ్యూజన్ అమ్మాయి కథే ‘హ్యాపీ వెడ్డింగ్..’.

రివ్యూ: హ్యాపీ వెడ్డింగ్
బ్యానర్: పాకెట్ సినిమా, యూవీ క్రియేషన్స్
నటీనటులు: సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల, మురళీ శర్మ, నరేష్, పవిత్రా లోకేష్, తులసి, అన్నపూర్ణ. ఇంద్రజ తదితరులు
ఫోటోగ్రఫీ : బాల్ రెడ్డి
సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌
సంగీతం: ధమన్
నిర్మాత: ఎం. సుమంత్‌ రాజు
రచన-దర్శకత్వం: లక్ష్మణ్‌
విడుదల తేది: 28-07-2018

స్టార్ ప్రొడ్యూసర్ తనయుడిగా వెండి తెరపై అడుగు పెట్టిన సుమంత్ అశ్విన్… మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఇద్దరూ కలిసి లక్ష్మణ్ దర్శకత్వంలో నటించిన సినిమా హ్యాపీ వెడ్డింగ్…నూతన దర్శకుడు లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా యువీ క్రియేషన్స్‌ లాంటి సక్సెస్‌ఫుల్‌ నిర్మాణ సంస్థ సమర్పణలో తెరకెక్కటంతో రిలీజ్ కు ముందు నుంచే మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అందుకు తగ్గట్టుగా ఆడియోతో పాటు టీజర్‌, ట్రైలర్‌లు కూడా ఆకట్టుకోవటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.పెళ్లి తాలుకూ సంతోషాలకు అద్దం పట్టే కథతో శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. పెళ్లి అనగానే అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారు? ఏయే విషయాల గురించి భయపడతారు? వాటిని దర్శకుడు ఎలా చూపించాడు? పెళ్లి జంటగా నటించిన సుమంత్‌ అశ్విన్‌, నిహారిక ఏ మేరకు ఆకట్టుకున్నారు? తెలుసుకుందాం…!!

కథ: ఇది విజయవాడ అబ్బాయి, హైదరాబాద్‌ అమ్మాయిల పెళ్లి కథ. విజయవాడలో ఉండే గోపాల్‌ (నరేష్‌), లలిత(పవిత్రా లోకేష్‌)ల అబ్బాయి ఆనంద్‌ విరాట్‌ వాకలపూడి (సుమంత్‌ అశ్విన్‌). యాడ్‌ ఫిలింకు మేకర్‌ అయిన ఆనంద్‌ది మెచ్యూర్డ్‌ గా ఆలోచించే మనస్థత్వం. హైదరాబాద్‌లో ఉండే హనుమంతరావు (మురళీ శర్మ), లత(తులసి)ల అమ్మాయి అక్షర (నిహారిక కొణిదెల). డిజైనర్‌ గా పనిచేసే అక్షరది ఏ విషయంలోనూ వెంటనే నిర్ణయం తీసుకోలేని చంచల మనస్థత్వం. ఆనంద్‌(సుమంత్‌ అశ్విన్‌), అక్షర(నిహారిక) వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. పెళ్లి ఇంకొన్ని రోజుల్లో ఉందనగా, అక్షరలో లేనిపోని కన్‌ఫ్యూజన్లు మొదలవుతాయి. పెళ్లయిన తర్వాత తన స్వేచ్ఛ, ఇష్టాయిష్టాలకు దూరంగా ఉండాలేమోనన్న భయం ఆమెలో ఆవరిస్తుంది. తన పట్ల ఆనంద్‌ చిన్నపాటి అలసత్వం చూపించినా భరించలేకపోతుంది. ఈలోగా, తన మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ మల్లి.(రాజా). అక్షర జీవితంలోకి వస్తాడు. ఇన్ని తికమకల మధ్య అక్షర ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అక్షరను ఆనంద్‌ ఎలా తన దారిలోకి తీసుకొచ్చాడు అనేది వెండి తెరపై చూడాల్సిందే…!

విశ్లేషణ:తెలుగు తెర మీద పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఘన విజయం సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే బాటలో హ్యాపి వెడ్డింగ్‌ సినిమాతో మరో అందమైన ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు లక్ష్మణ్. పెళ్లి అనగానే చాలా మంది అమ్మాయిల్లో ఉండే కన్‌ఫ్యూజన్లు, భయాలు, వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయన్నదే సినిమా ఇతివృత్తం. చాలా సున్నితమైన అంశానికి కుటుంబ బంధాలు, ఒక పండగలాంటి వాతావరణం జోడించి తెరపై అందంగా భావోద్వేగంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సాధారణంగా ప్రతి అమ్మాయిలో ఉండే గందరగోళాన్ని కథానాయిక పాత్రకు ఆపాదించి దానిని చుట్టూనే కథను నడిపించడం వల్ల సన్నివేశాలన్నీ సహజంగా అనిపిస్తాయి. అక్షర పాత్రలో ఉన్న గందరగోళాన్ని తెరపై బాగా తీసుకురాగలిగాడు దర్శకుడు. ఆ పాత్రలో చాలా మంది అమ్మాయిలు తమను తాము చూసుకునే అవకాశం దక్కింది. అటు అక్షర కుటుంబలోనూ ఇటు ఆనంద్‌ కుటుంబంలోనూ అన్ని పాజిటివ్‌ పాత్రలే కనిపించడంతో కథ, కథనాలన్నీ సాఫీగా సాగిపోతుంటాయి. ఎటొచ్చీ అక్షర పాత్ర, ఆమె ప్రవర్తించే విధానమే, సాఫీగా సాగే ప్రయాణాన్ని కుదుపుల్లోకి నెట్టేస్తుంది. చాలా సన్నివేశాలు సహజంగా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం దర్శకుడు మరింత స్వేచ్ఛను తీసుకున్నాడు.

పతాక సన్నివేశాలకు ముందొచ్చే ఘట్టాలు సినిమా కథలోని ఆత్మకు అద్దం పట్టాయి. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో, అక్కడ పూర్తిగా చెప్పగలిగాడు. అటు అబ్బాయిలకు, ఇటు అమ్మాయిలకు ఆ పాయింట్‌ కనెక్ట్‌ అవుతుంది. అలా దర్శకుడి లక్ష్యం నెరవేరినట్లు అయింది. మధ్య మధ్యలో సీరియల్‌ తరహాలో సాగే సన్నివేశాలు, షార్ట్‌ ఫిల్మ్‌లా అనిపించే సందర్భాలు కొన్ని కనిపించినా, కాస్త ఓపిగా కూర్చుంటే ఓ ఫీల్‌ గుడ్‌ మూవీని ఎంజాయ్‌ చేసి రావచ్చు.

ఎవరెలా చేశారంటే: సుమంత్‌ అశ్విన్‌, నిహారిక జంట బాగుంది. ఈ కథకు పక్కాగా సరిపోయారు. నిహారిక. అక్షర పాత్రలో ఉన్న కన్‌ఫ్యూజన్‌ను చక్కగా పలికించింది. ఒక్క ఫ్రేమ్‌లోనూ తడబడలేదు. ఈ తరహా పాత్రలకు కచ్చితంగా మంచి ఛాయిస్‌ అవుతుంది. నరేష్‌ మరోసారి తనదైన శైలిలో నవ్వించాడు. ఓ మంచి తండ్రిగా బాధ్యతాయుతమైన పాత్రలో కనిపించాడు. మురళీశర్మ నటన కూడా ఆకట్టుకుంటుంది. పవిత్రా లోకేష్‌, అన్నపూర్ణ, పూర్ణిమ ఇలా అందరూ అనుభవజ్ఞులే కాబట్టి, ప్రతి పాత్రకు న్యాయం జరిగింది. సినిమాకు ప్రధాన బలం సంగీతం. శక్తికాంత్‌ కార్తీక్‌ అందించి పాటలు బాగున్నాయి. పాటలు కావాలని ఇరికించినట్టుగా కాకుండా కథలో భాగంగా వచ్చి వెలుతూ అలరిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. తమన్‌ అందించిన నేపథ్య సంగీతం కూల్‌గా ఉంది. పెళ్లి వాతావరణాన్ని కెమెరాలో అందంగా బంధించారు. దర్శకుడు ప్రధాన బలం మాటలు. చాలా చోట్ల కవిత్వాన్ని రంగరించాడు. కొన్ని చోట్ల సంభాషణలు గుండెకు హత్తుకున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా…. ఓపికగా కూర్చుంటే ఫీల్ గుడ్ మూవీ ‘హ్యాపీ వెడ్డింగ్ ‘

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here