CinemaMovies Reviews

రివ్యూ: గూఢచారి.. యాక్షన్ సినిమాలు నచ్చే వారికి మెచ్చే సినిమా

రివ్యూ: గూఢచారి

నటీనటులు: అడవి శేష్, ధూళిపాళ శోభిత, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, మధుశాలిని, అనిష్ కురివెల్ల, సుప్రియా యార్లగడ్డ, వెన్నెల కిషోర్ తదితరులు…

ఫోటోగ్రఫి : శనీల్ డియో
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
కథ అడివి శేష్
స్క్రీన్ ప్లే : అడివి శేష్, శశి కిరణ్ తిక్క, రాహుల్ పాకాల
నిర్మాతలు : అభిషేక్ నమ, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
దర్శకత్వం : శశికిరణ్ తిక్క

దర్శకుడు అడివి సాయి కిరణ్ కు తమ్ముడు వరసైన అడివి శేష్… కర్మ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టాడు. ఇక పంజా సినిమాలో విలన్ గా నటించి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. రన్ రాజా రన్, బాహుబలి, క్షణం,
వంటి సినిమాల్లో నటించిన అడివి శేష్ మంచి నటుడే కాదు.. మంచి రచయిత.. దర్శకుడు కూడా.. ఇప్పటికే క్షణం సినిమాతో తనలోని దర్శకత్వ ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేస్తే… తాజాగా గూఢచారి సినిమాతో కథా రచయిత, స్క్రీన్ ప్లే టాలెంట్ ను ప్రేక్షకులకు చూపించి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని నిరూపించుకున్నాడు. తన కథకు తానే హీరోగా నటించిన గూఢచారి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకున్నాడో.. మళ్ళీ తన ఖాతాలోకి మరో హిట్ ను వేసుకున్నాడో లేదో చూద్దాం…!!

కథ:
దేశాన్ని కాపాడడం కోసం మన ప్రభుత్వం త్రినేత్ర అనే మిషన్ ను చేపడుతుంది. సైనికులు సరిహద్దుల్లో మాత్రమే కాకుండా దేశం లోపల కూడా ఉండి ప్రజలను, ప్రభుత్వాన్ని కాపాడాలనేది దీని ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి సంబంధించిన వివరాలు ప్రత్యర్థులకు లీక్ అవ్వడంతో వెంటనే మిషన్ ను ఆపేస్తారు. త్రినేత్ర మిషన్ లో ఉన్న వ్యక్తులే ఈ వివరాలు బయటకు అందించారని సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ క్రమంలో రఘువీర్ అనే ఆఫీసర్ చనిపోతాడు. అతడి కొడుకు గోపి(అడివిశేష్) చిన్నపిల్లాడు కావడంతో అతడి ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందని అతడి మావయ్య సత్య(ప్రకాష్ రాజ్) గోపి పేరు అర్జున్ గా మార్చి పెంచుతాడు. ఇక అర్జున్ ఇండియన్ సర్వీసస్ లో పనిచేయాలన్నది అతని లక్ష్యం. పట్టు వదలకుండా ట్రై చేసిన ‘రా’ లో జాయిన్ అవుతాడు. ట్రైనింగ్ లో ఉండగా సమీరా పరిచయం అవుతుంది. తన ఐడెంటిటీని సమీరా(శోభిత దూళిపాళ్ళ) తో చెబుతాడు. అర్జున్ ట్రైనింగ్ పూర్తయిన వెంటనే త్రినేత్ర టీం లో మెంబర్ అవుతాడు. ఇండియాలో జరిగే ఉగ్రవాద దాడులను అరికట్టే ఈ టీం లో ఒక చీఫ్ ఆఫీసర్ తో పాటు త్రినేత్ర ను మొదలుపెట్టిన ఆఫీసర్ కూడా ఒక ఎటాక్ లో చనిపోతారు. ఆ ఎటాక్ కి కారణం అర్జున్ అని ఆధారాలు దొరుకుతాయి. అర్జున్ ని చంపాలనే ప్రయత్నంలో ఉగ్రావాదులు సమీర చంపేస్తారు. అసలు అర్జున్ ఎవరు..? అతని పేరు అర్జునేనా..? ఒక ఉగ్రవాద సంస్థ అర్జున్ ని ఎందుకు వెంటాడుతుంది..? అనే విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.. !


విశ్లేషణ:
ఇండియన్ సినిమాల్లో జేమ్స్ బాండ్ తరహా కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. అటువంటి నేపథ్యంలో తెరకెక్కిన కథే గూఢచారి. స్పై థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన గుఢాచారి కి ప్రధాన బలం దేశం మీద ప్రేమ అయితే బలహీనత కుటుంబం మీద ప్రేమ ఈ రెండిటి మద్య ఎక్కడా బాలెన్స్ తప్పకుండా కథను తీసుకెళ్ళాడు. కథలోని ప్రతి పాత్ర కీలక భాగం అయ్యాయి. అడివిశేషు పాత్రలోని పెయిన్ అతని కళ్ళలో ఎప్పుడూ కనపిస్తూనే ఉంది. ఒక ప్రేమకథ లోని ఫీల్ ని తక్కువ సీన్స్ లో ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో దర్శకుడు శశికిరణ్ సక్సెస్ అయ్యాడు. ఇటువంటి సీరియస్ కథ మధ్యలో లవ్ స్టోరీ ఏంటి..? ఈ రొమాన్స్ ఏంటని..? ఆడియన్స్ అనుకునేలోపు హీరోయిన్ అసలు ఎందుకు అతడిని ప్రేమించాల్సి వచ్చిందనే విషయాలు షాకింగ్ గా అనిపిస్తాయి. శోభిత లుక్ ఆకట్టుకుంది. అలాగే తన పై పడిన నిందను తొలిగించుకునేందుకు అతను చేసిన ప్రయాణంలో ప్రతి మలుపు ఆసక్తికరంగా ఉంటుంది. టెక్నాలిజీ ని బ్రిలియెన్స్ ని సమపాళ్ళలో వాడి యాక్షన్ సన్నివేశాలను రక్తి కట్టించాడు. అసలు అర్జున్ ని ప్రత్యర్ధులు ఎందుకు టార్గెట్ చేశారనే విషయాలు ప్రీక్లైమాక్స్ వరకు రివీల్ చేయలేదు. బంగ్లాదేశ్ లోని యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది.

కానీ ఇంటర్వెల్ సమయానికి సినిమాలో రాసుకున్న ట్విస్ట్ హైలైట్ గా నిలిచింది. సినిమాలో చాలా ట్విస్టులు రాసుకున్నాడు అడివి శేష్. సెకండ్ హాఫ్ లో ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వెళ్లడం కథపై ఆసక్తిని పెంచుతుంది. తన తండ్రిలాగా దేశానికి సేవ చేయాలనుకునే అర్జున్ క్యారెక్టర్ తన తండ్రి నిజ స్వరూపం తెలుసుకొని షాక్ అయిపోతాడు. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితుల్లో తన తండ్రి అర్జున్ ని వెతుక్కుంటూ రావడం మరో ట్విస్ట్. సినిమాలో ఈ ఫాదర్ క్యారెక్టర్ హైలైట్ గా నిలుస్తుంది. సినిమా టీమ్ ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా ఈ ఫాదర్ క్యారెక్టర్ ఎందుకు లీక్ చేయాలనుకోలేదో.. సినిమా చూస్తే తెలుస్తుంది. ఆడియన్స్ కి ఇదొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్. సినిమా ఒక ఫ్లోలో సాగిపోతుంటుంది. ఎక్కడా బోర్ అనే ఫీలింగ్ కలగదు. నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీని ఆడియన్స్ కి క్రియేట్ చేయడంలో చిత్రబృందం సక్సెస్ అయింది.

అడివిశేష్ రాసిన కథను తన టేకింగ్ తో శశికిరణ్ మరోస్థాయికి తీసుకెళ్లాడు. జగపతిబాబు కోసం రాసుకున్న ట్రాక్ ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు జగపతిబాబు. ఈ థ్రిల్లర్ లో ఎక్కువగా సర్ ప్రైజ్ చేసింది సుప్రియ నటన. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తెరమీద కనిపించిన ఈ అక్కినేని వారసురాలు ఒక ‘రా’ సీనియర్ ఎంజెంట్ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. కళ్ళలో కనిపంచే తీవ్రత, స్క్రీన్ ప్రజెన్స్ పాత్రకు ప్రాణం పోసాయి. మధుశాలినికి చాలా కాలం తరువాత మంచి పాత్ర దక్కిందని చెప్పాలి. యాక్షన్ సీన్స్ లో సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రకాష్ రాజ్, అనీష్ కురివెళ్ల వంటి తారలు తమ పరిధుల్లో బాగా నటించారు. వెన్నెల కిషోర్ పాత్రకి కామెడీతో పాటు ఓ ట్విస్ట్ కూడా పెట్టడం బాగుంది. నటీనటులు తమ పెర్ఫార్మన్స్ తో కథకు పూర్తి న్యాయం చేశారు. శనీల్ కెమెరా వర్క్, శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సాంకేతిక పరంగా ఎక్కడా పేరు పెట్టని విధంగా తెరకెక్కింది గూఢచారి. గరుడ వేగ సినిమా తర్వాత మళ్ళీ గూఢచారి తెలుగు తెరకు యాక్షన్ సినిమా రంగును అద్దాయి.

Comment here