తండ్రిని మాయచేసి 22లక్షలు కొట్టేసిన కిలాడి లేడీ

ఓ కిలాడీ లేడీ ప్రియుడుకోసం కన్న తండ్రినే మోసం చేసింది. వివరాలలోకి వెళితే, హైదరాబాద్ కాటేదాన్లోని మైలార్ దేవులపల్లి లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డ్ లో ఉండే స్థిరాస్తి వ్యాపారి ముజఫర్ ఇంట్లో 22 లక్షల రూపాయలు దోచుకెళ్ళారు. అతని కుమార్తె తస్కీమ్ బాను(20)ను కొట్టి 22లక్షల నగదు దోచుకెళ్లినట్లు, ముజఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దొంగతనం జరిగిన విధానం గురించి ఆరా తీస్తూ ముజఫర్, అతని కూతురు తస్కీమ్ బాను ల ఫోన్ కాల్స్, వాట్సప్ సందేశాలను పరిశీలించారు.అతని కూతురిపై అనుమానం కలిగి పూర్తి విచారణ చేయగా విషయం బయట పడింది. నాగారం గ్రామానికి చెందిన అష్రఫ్(22)ను తస్కీమ్ బాను ప్రేమించింది. అష్రఫ్ ఏదోఒక వ్యాపారం చేస్తుంటే కానీ తన తండ్రి అష్రఫ్ ని అల్లుడుగా అంగీకరించడని భావించి, అతనికి వ్యాపారం చేసేందుకు డబ్బు సహాయం చేయాలని అనుకుంది. అదే టైంలో తన తండ్రి ముజఫర్ ఓ ప్లాటు అమ్మాడు. ఆ డబ్బును ఇంట్లోని అల్మారాలో దాయటం చూసిన తస్కీమ్, ప్రియుడు అష్రఫ్ తో కలసి ప్లాన్ వేసి ఆ డబ్బు కొట్టేసారు. బయటకు వెళ్లిన తండ్రి ఇంటికి తిరిగి రాగానే, బోరున ఏడుస్తూ నలుగురు దొంగలు నన్ను కొట్టి నగదు ఎత్తుకెళ్లినట్లు నమ్మించింది. దీంతో ఈ నేరానికి పాల్పడిన తస్కీమ్ బాను, అష్రఫ్, వీళ్లకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని19.5 లక్షల రూ. నగదును స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here