సిబిఐ ఇప్పుడు సోకాల్డ్ బీబీఐ : సీఎం మమతా బెనర్జీ

ప్రముఖ దర్యాప్తు సంస్థ సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)లో ఉన్నతాధికారుల లంచాల భాగోతం యావత్ భారతదేశాన్ని షాక్ కు గురి చేసింది. శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు..అందరి అవినీతిపై దర్యాప్తు చేయాల్సిన సీబీఐ తానే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అక్రమార్కులపై కేసులు పెట్టాల్సిన సీబీఐ తన సంస్థ డైరెక్టర్ పైనే కేసు పెట్టుకుంది. దొంగల్ని అరెస్టు చేయాల్సిన సీబీఐ తన డిఎస్పీనే అరెస్ట్ చేసుకుంది. అవినీతిపరుల ఇళ్లపై దాడులు చేయాల్సిన సీబీఐ తన ప్రధాన కార్యాలయంలో తానే సోదాలు చేసుకుంది. ఇంతకాలం “కేంద్ర ప్రభుత్వం చేతిలో పావు” అని ముద్ర పడ్డ సీబీఐ.., ఇప్పుడు లంచగొండుల కుట్రల ముఠాగా దుష్కీర్తి మూటగట్టుకుంది. తాను మునగడమే కాదు, దేశ అత్యున్నత గూఢచార సంస్థ “రా” ను, “ఈడీ” ని కూడా తనతోపాటు కట్టగట్టి లంచాల పంకిలంలో నిలువునా ముంచింది. భారదేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలన్నీ విశ్వసనీయత సంక్షోభంలో చిక్కుకున్నాయి. దేశంలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఒక్కో ప్రతిపక్ష పార్టీ ఒక్కోరకంగా విమర్శలు చేస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. “సీబీఐ ఇప్పుడు సోకాల్డ్ బీబీఐ(బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) గా మారిపోయింది. ఇది చాలా దురదృష్టకరం” అంటూ ఆమె విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here