ముంబై వాసులను వణికిస్తున్న బ్లూ బాటిల్ జెల్లీఫిష్ లు

దేశ ఆర్ధిక రాజధాని ముంబై ను బ్లూ బాటిల్ జెల్లీఫిష్ (విష‌పు చేప‌లు ) లు గ‌త రెండు రోజుల నుంచి వణికిస్తున్నాయి. ఈ విషపు చేపలు ముంబాయి న‌గ‌ర సముద్ర ఒడ్డును వేల సంఖ్య‌లో ముంచెత్తుతున్నాయి. విష‌పూరిత‌మైన ఈ జెల్లీ ఫిష్ లు గ‌త రెండు రోజుల్లో జుహు బీచ్ కు వెళ్లిన దాదాపు 150 మందిని కరిచిన‌ట్లు తెలుస్తోంది. వీటి విషం వ‌ల్ల ప్రాణాల‌కు ప్ర‌మాదం ఏమీ లేక‌పోయిన‌ప్ప‌టికి కొన్ని గంట‌ల పాటు భ‌రించ‌లేని నొప్పి వుంటుంద‌ట‌. ప్ర‌తి ఏటా వ‌ర్షాకాలంలో ఇటువంటి జ‌ల‌చ‌రాలు స‌ముద్ర‌పు ఒడ్డుకు రావ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మే అయిన‌ప్ప‌టికి ఈ ఏడాది ఇవి వేల సంఖ్య‌లో ముంబ‌యి స‌ముద్ర ఒడ్డుకు వ‌చ్చాయి.

దీంతో అధికారులు బీచ్ ప్రాంతంలో హెచ్చ‌రిక బోర్డులు పెట్టారు. సాధ్య‌మైనంత‌వ‌ర‌కు బీచ్ ప‌రిస‌ర ప్రాంతాల‌కు ముఖ్యంగా స‌ముద్రం ఒడ్డుకు వెళ్ల‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రిస్తున్నారు. ఎంతో అందంగా క‌నిపించే ఈ బ్లూ బాటిల్ జెల్లీ ఫిష్ మూమూలుగా స‌ముద్రం బాగా లోతుగా వున్న చోట నివ‌సిస్తుంది. అయితే దాని బ‌రువు చాలా త‌క్కువ‌గా వుండ‌టం వ‌ల్ల భారీ వ‌ర్షాల కార‌ణంగా స‌ముద్రంలో పోటు పెరిగిన‌ప్పుడు అల‌ల తాకిడికి ఒడ్డుకు కొట్టుకు వ‌స్తాయి.

ఇవి కరిస్తే వ‌ళ్లంతా అల‌ర్జీ రావ‌డంతో పాటు జ్వ‌రం కూడా వ‌స్తుంద‌ని, భ‌రించ‌లేని నొప్పి వుంటుంద‌ని జ‌ల‌చ‌రాల నిపుణుడు శంక‌ర్ గ‌జ్బాజె తెలిపారు. కొన్ని సంద‌ర్భాల‌లో గుండె, ఊపిరితిత్తుల‌పై కూడా ప్ర‌భావం చూసి ప్రాణాంత‌కంగా మార‌వ‌చ్చ‌ని అన్నారు. ఇవి ఎక్కువ‌గా ఆస్ట్రేలియా బీచ్ ల‌లో క‌నిపిస్తుంటాయి.

చూడ‌టానికి అందంగా వుండ‌టం వ‌ల్ల చాలామంది వాటిని ముట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించి గాయ‌ప‌డుతున్నారు. వీటి కాటుకు గురైన వారు ఆందోళ‌న చెంద‌కుండా వెంట‌నే కాటు ప‌డిన చోట స‌ముద్రపు నీటితో క‌డిగి వాటి కొండేల‌ను తీసివేయాలి. వేడి నీటితో క‌డిగితే మ‌రీ మంచిది. ఆ త‌ర‌వాత చికిత్స కోసం ద‌గ్గ‌ర‌లోని ఆస్ప‌త్రికి వెళ్ల‌మ‌ని నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు. తాజాగా గోవా ప్ర‌భుత్వం కూడా త‌మ రాష్ట్రంలోని బీచ్ ల వ‌ద్ద ఈ జెల్లీ ఫిష్ గురించి హెచ్చరిక బోర్డులు పెట్టింది. ప్ర‌జ‌లు, సంద‌ర్శ‌కులు కొద్ది రోజుల పాటు బీచ్ వైపు వెళ్ల‌వ‌ద్ద‌ని స‌ల‌హా ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here