Local news

బీజేపీతో వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయి:మంత్రి కళా వెంకట్రావు

బీజేపీతో వైసీపీ, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు. మంగళవారం విజయనగరంలోని అతిథి గృహంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ, జనసేన పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తుఫాను అతలాకుతలం చేస్తే…బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికు సమయమే లేదని ఎద్దేవాచేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయోమయంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విజయనగరం జిల్లా సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నామని, ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరారని ఆయన తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి త్వరలోనే టెండర్లు పూర్తవుతాయని మంత్రి కళా వెంకట్రావు తెలిపారు.

Comment here