లోక్ పాల్ కోసం అన్నాహజారే దీక్ష : అక్టోబర్ 2న ప్రారంభం

లోక్ పాల్ నియామకంలో జాప్యాన్ని నిరసిస్తూ నిరాహారదీక్ష చేయనున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే ప్రకటించారు. మహాత్మా గాంధీ జయంతైన అక్టోబర్ 2వ తేదీ నుంచి దీక్షను ప్రారంభిస్తున్నట్లు ఆదివారం ఆయన విలేకరులకు తెలిపారు. లోక్ పాల్ నియామకంలో జరుగుతున్న జాప్యం పట్ల ఆయన తీవ్ర అసంతృపి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అహమ్మద్ నగర్ జిల్లాలోని తన సొంత గ్రామమైన రాలేగావ్ సిద్ధిలో నిరాహారదీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. అవినీతి రహిత దేశాన్ని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ తన ఉద్యమంలో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు చేసారు. సాధారణ ఎన్నికలకు ముందు లోక్ పాల్ బిల్లును అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, అప్పటికే రాష్టప్రతి సంతకం అయ్యి ఉన్న బిల్లును, తాము అధికారంలోకి రాగానే ఆచరణలోకి తీసుకువస్తామని ఆ పార్టీ నేతలు పదే పదే అప్పట్లో ప్రకటనలు గుప్పించారని ఆయన గుర్తుచేశారు. అప్పుడిచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ఆయన ప్రశ్నించారు. అవినీతి రహిత రాజ్యమని ప్రచారం చేసుకున్న నరేంద్రమోదీకి, ఇతర బీజేపీ నేతలకు…,వాస్తవానికి ఆ దిశలో చిత్తశుద్ధి లేదన్నారు. అందువల్లే రకరకాల కారణాలతో లోక్ పాల్ ను నియమించడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి రహిత భారత్ కోసం 2011లో 12 రోజులు అన్నాహజారే నిరాహారదీక్ష చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఉద్యమానికి అప్పట్లో దేశవ్యాప్త మద్దతు లభించింది. అదే స్థాయిలో తిరిగి తనకు మద్దతు ఇవ్వాలని దేశ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. లోక్ పాల్ నియామకంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై ఇటీవలే సుప్రీంకోర్టు సైతం అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపధ్యంలో తాజాగా తాను నిరాహారదీక్ష చేయనున్నట్లు ప్రకటించారు…… KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here