Movies ReviewsReviews

రివ్యూ: సరదాగా, ‘సమ్మోహనం’గా సాగే చిత్రం.. !!

రివ్యూ: సమ్మోహనం

బ్యానర్ : శ్రీ దేవి మూవీస్
నటినటులు: సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, రోహిణి, నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శిశిర్‌శ‌ర్మ, అభయ్ , హర్షిణి త‌దిత‌రులు.
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌,
ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.
విడుదల తేది: 15-06-2018
తెలుగుదనానికి స్వచ్చమైన వినోదంతో పెద్ద పీట వేస్తూ… కుటుంబ సమేతంగా చూసే సినిమాలను తీసే దర్శకుడు ఇంద్ర గంటి మోహన్ కృష్ణ. డిఫరెంట్ నేపథ్య కథలతో సినిమాలను తెరకెక్కించే ఆయన నుంచి సినిమా అని ప్రకటన వెలువడగానే వెంటనే ఒక కొత్తదనం ఉంటుంది అని ప్రేక్షకులకు ఓ నమ్మకం. ఈ సారి ప్రేక్షకుల ముందు అనూహ్యమైన ప్రేమ కథ అంటూ స్మమోహనం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. దర్శకుడు ఇంద్ర గంటి మోహన్ కృష్ణ. ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు, స్టార్ హీరోయిన్ మ‌ధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుంది? అనే విష‌యాన్ని ప్రెజెంట్ చేస్తూనే సినిమా వాళ్ల ప‌రిస్థితులను కూడా అందంగా, అంద‌రూ న‌వ్వుకునేలా తెర‌కెక్కించారు ఇంద్ర‌గంటి. సుధీర్ బాబు, అదితిరావు ల జోడి.. ఆకట్టుకొనే ప్రచారంతో ముందుగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసిన సమ్మోహనం సినిమా ఎలా ఉంది.. దర్శకుడు ఇంద్ర గంటి తన మ్యాజిక్ ను మళ్ళీ రిపీట్ చేశాడా..? సుధీర్ బాబు, అదితిరావు ల జోడి ఏ మేరకు ఆకట్టుకున్నారు ? లేదా? అని తెలియాలంటే సినిమా క‌థ‌లోకి వెళ్ళాల్సిందే.

కథ: ఆర్. విజయ్ కుమార్ (సుధీర్ బాబు) ఓ చిత్ర కారుడు. చిల్డ్ర‌న్ బుక్ ఇల‌స్ట్రేట‌ర్‌గా త‌న ప్ర‌తిభ‌ని నిరూపించుకొనే ప్ర‌య‌త్నంలో చేస్తుంటాడు.. త‌న క‌ళ పిల్ల‌ల ఊహాశ‌క్తిని పెంచుతుంద‌ని న‌మ్ముతుంటాడు. సినిమాలంటే ఇష్టం ఉండదు. ఇక సినిమాలో చూపించేదంతా న‌టనే.. వారికి ఎమోష‌న్స్ ఉండ‌వు .. అనేటువంటి భావ‌న‌లుంటాయి. అయితే విజ‌య్ తండ్రి శ‌ర్వా(సీనియ‌ర్ న‌రేశ్‌)కి మాత్రం సినిమాలంటే పిచ్చి ప్రేమ. ఎప్పటికైనా తనని తాను తెరపై చూసుకోవాలనే తపన పడుతుంటాడు. దీంతో రిటైర్మెంట్ అయినా త‌ర్వాత సినిమాల్లో రాణించ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. త‌ను ఓ సంద‌ర్భంలో ‘కుమ్మేస్తా’ చిత్ర‌బృందం షూటింగ్ కోస‌మ‌ని వాళ్ల ఇంటిని ఫ్రీగా అద్దెకిస్తాడు. ఆ సినిమాలో క‌థానాయిక స‌మీరా రాథాడ్ (అదితిరావు హైద‌రీ). ఉత్త‌రాది నుంచి వ‌చ్చిన ఆమెతో విజ‌య్‌కి స్నేహం ఏర్ప‌డుతుంది. సినిమాలోని తెలుగు సంభాష‌ణ‌ల్ని విజ‌య్‌ ద్వారా నేర్చుకుంటుంది స‌మీర‌. ఈ క్ర‌మంలోనే విజ‌య్.. స‌మీర ప్రేమ‌లో ప‌డ‌తాడు. మ‌నాలీలో చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న స‌మీర ద‌గ్గ‌రికి వెళ్లి త‌న ప్రేమ విష‌యాన్ని చెబుతాడు. విజ‌య్ చెప్పిన ప్రేమ‌ను రిజెక్ట్ చేస్తుంది. దాంతో విజయ్ డిస్ట్ర‌బ్ అవుతాడు. తిరిగి విజ‌య్ మామూలు మ‌నిషి అవుతాడా? మ‌రి స్టార్ క‌థానాయిక‌గా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వెలుగుతున్న సమీర… ఒక సామాన్య‌ యువ‌కుడైన విజయ్‌ని ప్రేమించిందా? క‌థానాయిక‌గా బ‌య‌టికి అందంగా క‌నిపించే స‌మీర జీవితం వెన‌క ఎలాంటి క‌ష్టాలుంటాయి? ఇవన్ని వెండి తెరపై చూడాల్సిందే..!!

కథనం: సినిమాలంటే మంచి అభిప్రాయం లేని ఒక యువకుడికి.. ఒక స్టార్ హీరోయిన్ కి మధ్య ప్రేమ నేపథ్యంలో సాగే చిత్రం. నటీనటులు కూడా మ‌నుషులే, వాళ్లూ సామాన్య‌మైన జీవితాన్ని గ‌డ‌పడానికి ఇష్ట‌ప‌డ‌తార‌నే విష‌యంతో పాటు… బ‌య‌ట మాట్లాడుకొనేంత చెత్తగా సినిమా ప‌రిశ్ర‌మ ఉండ‌ద‌నే ఓ సందేశాన్నిస్తుందీ చిత్రం. సినిమానే క‌ల‌గా భావిస్తూ… కెరీర్‌ని మ‌ల‌చుకొనే స‌గ‌టు క‌థానాయిక జీవితాల వెన‌క సంఘ‌ర్ష‌ణ‌ కూడా ఇందులో ప్ర‌తిబింబిస్తుంది. ఒక ప్రేమ‌క‌థ‌తో సాగే చిత్రం కాబ‌ట్టి.. నాయ‌కానాయిక‌ల మ‌ధ్య మంచి కెమిస్ట్రీ బ‌లంగా పండాలి. ఆ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకొనే ద‌ర్శ‌కుడు ప్రేమ చిగురించే స‌న్నివేశాల కోసం బాగా స‌మ‌యం తీసుకొన్నాడు. వాటిని కాస్త గాఢ‌త‌తో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. దాంతో కొన్ని స‌న్నివేశాలు న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్న‌ట్టు అనిపిస్తాయి. మ‌ధ్య మ‌ధ్య‌లో ఔత్సాహిక న‌టుడిగా న‌రేష్ పండించే కామెడీ ప్రేక్ష‌కుల‌కు మంచి స‌ర‌దాని పంచుతుంది.పేరుకి ఇది ప్రేమ క‌థే అయినా సినిమా ఆద్యంతం ఎక్క‌డికక్క‌డ ఉప‌న‌దుల‌ను క‌లుపుకొని ప్ర‌వ‌హించే జీవ‌న‌దిలా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హీరోయిన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కాస్త కామ‌న్‌గా ఉంటుంది. డైలాగులు బావున్నాయి. మ‌రీ ముఖ్యంగా తెలుగు గొప్ప‌ద‌నం గురించి, సినిమా వాళ్ల‌ను చూసి మామూలు జ‌నాలు చెప్పుకొనే మాట‌ల‌ను చాలా రాశారు.

తొలి స‌గ‌భాగం సినిమా అంతా కూడా విజ‌య్ ఇంట్లో 20 రోజులు షూటింగ్ సంద‌డి… స‌మీర‌తో ప్రేమలో ప‌డే స‌న్నివేశాల‌తోనే సాగుతుంది. మ‌లి భాగంలో కాస్త డ్రామాని జోడించారు. క‌థానాయిక స‌మీర జీవితం వెన‌క ఉన్న సంఘ‌ట‌న‌ల్ని చూపించారు. స‌గ‌టు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు వాస్తవికతకు అద్దం ప‌ట్టేలా ఉన్న‌ప్ప‌టికీ… వాటిపైన వ్యంగ్యాస్త్రాలు సంధించిన‌ట్టు అనిపిస్తాయి. ప‌తాక స‌న్నివేశాల్లో న‌రేష్ చేసే హంగామా బాగుంది. కానీ, బుక్ ఆవిష్క‌ర‌ణ నేప‌థ్యంలో చెప్పే క‌థ‌లు కాస్త సాగ‌దీత‌ అనిపిస్తుంది.

గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాలో సుధీర్‌బాబు న‌ట‌న చాలా బాగుంది. ఒక మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన యువ‌కుడిగా ఆయ‌న అభినయం ఆక‌ట్టుకుంటుంది. ప్రేమ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల్లోనూ, భావోద్వేగాల ప‌రంగానూ ఆయ‌నలోని ప‌రిణ‌తి స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. స‌మీర రాథోడ్‌గా అదితి హైద‌రీ ఆక‌ట్టుకుంటుంది. ఆమె అందం, న‌ట‌న చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌లు వాళ్ల పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. సినిమాపై త‌ప‌న ఉన్న వ్య‌క్తి పాత్ర‌లో న‌రేష్ చక్కని హాస్యాన్ని పండించారు. న‌వ్వించ‌డంతో పాటు, అక్క‌డ‌క్క‌డ హృద‌యాల్ని బ‌రువెక్కించేలా సాగుతుంది ఆయ‌న పాత్ర‌. ప‌విత్రా లోకేష్‌కి చాన్నాళ్ల త‌ర్వాత మంచి సినిమా అవుతుంది.
సినిమా కలర్ ఫుల్ గా సాగింది.. ముఖ్యంగా పి.జీ.విందా కెమెరా పనితనం చాలా బాగుంది. వివేక్ సాగ‌ర్ సంగీతం మరీ ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా బాగుంది. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యితగా మంచి ప‌నితీరును క‌న‌బ‌రిచారు. స్వ‌చ్ఛ‌మైన వినోదంతో చిత్రాన్ని తీర్చిదిద్దారు. శ్రీదేవి మూవీస్ స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్న‌త‌మైన నిర్మాణ విలువ‌లు తెర‌పై స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్: కథా నేపథ్యం, సుధీర్ బాబు, అదితి రావుల నటన, నరేష్ హాస్యం, ఫోటోగ్రఫీ
మైనేస్ పాయింట్స్: రొటీన్ హీరోయిన్ కష్టాలు, సాగదీసిన కొన్ని సన్నివేశాలు

సరదాగా సమ్మోహనంగా సాగే చిత్రం

Comment here