తొలి టెస్టులో భారత్ ఘనవిజయం… ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓటమి

టీమిండియా మరోసారి స్పిన్ మంత్రంతో దుమ్ములేపింది. తొలి టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ ను ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇంగ్లండ్ సిరీస్ లో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు ఈ విజయం కాస్త ఊరట కలిగించింది. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ భారత్ కు వెస్టిండీస్ కనీస పోటీని ఇవ్వలేకపోయింది. అటు బౌలింగ్లోనూ, ఇటు బ్యాటింగ్లోనూ చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు పృధ్వీషా (134), పుజారా (86), విరాట్ కోహ్లీ(139), రిషబ్ పంత్(92), జడేజా(100*) పరుగుల వరద పారించారు. టీమిండియా స్కోరు 649/9 వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ 181 పరుగులకే ఆలౌట్ అయ్యి ఫాలోఆన్ ఆడింది. 468 పరుగుల వెనుకబడింది. భారత్ బౌలర్లు అశ్విన్ 4 వికెట్లు, షమీ 2 వికెట్లు, జడేజా, కుల్దీప్, ఉమేష్ తలా ఒక్క వికెట్ తీశారు. ఫాలోఆన్ ఆడిన వెస్టిండీస్, భారత స్పిన్నర్లు చెలరేగడంతో మళ్లీ 196 పరుగలకే ఆలౌట్ అయ్యింది. వెస్టిండీస్ ఓపెనర్ కీరన్ పావెల్ (83) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు, జడేజా 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు తీశారు. తొలిటెస్టు మ్యాచ్లోనే రికార్డులు క్రియేట్ చేసిన యువ పృధ్వీషా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. రెండో టెస్టు మ్యాచ్ అక్టోబర్ 12 నుంచి హైదరాబాద్లో జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here